మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్‌లను సీల్ చేసి స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల గెలుపోటములపై భారీ ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఇక మున్సిపాలిటీ నుంచి అప్‌గ్రేడ్ అయి కార్పొరేషన్‌గా మారిన మహబూబ్‌నగర్‌లో గెలుపు ఎవరిదో.. మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇదిలా ఉండగా ఇటు కార్పొరేషన్లో అటు మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి నువ్వా.. నేనా.. అనే రీతిలో టైట్ ఫైట్ సాగింది. ఎక్కడా ఫలానా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఏ పార్టీ కూడా ధీమాతో చెప్పలేక పోతున్నది.
ఇక అలంపూర్‌లో మాత్రం మూడు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కోసం చేసిన ఏర్పాట్లను ఆయా జిల్లా కలెక్టర్లు పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే కౌంటింగ్ టేబుల్ల వారీగా చేపట్టనున్నారు. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నది.
కార్పొరేషన్ ఫలితాలపై టెన్షన్.. టెన్షన్
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నువ్వా.. నేనా.. అనే రీతిలో పోటీ నెలకొంది. మొత్తం 60 డివిజన్లో మేజిక్ ఫిగర్ 31 డివిజన్లు గెలిస్తే మేయర్ పదవి సొంతం అవుతుంది. పోలింగ్ సరళని చూస్తే ఎవరికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం బీఆర్ఎస్కు 20 నుంచి 25 డివిజన్లు, కాంగ్రెస్‌కు 22 నుంచి 26, బీజేపీకి మూడు నుంచి 6, ఎంఐఎంకు రెండు నుంచి నాలుగు, ఇండిపెండెంట్లకు ఒకటి లేక రెండు డివిజన్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే విపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశం కనిపిస్తున్నది. అయితే అధికార పార్టీకి మేయర్ పదవి దక్కకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీలో అసంతృప్తి నేతలు అంతా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిసారిగా జరుగుతున్న కార్పొరేషన్ ఫలితాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తోపాటు భూత్పూ ర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. నారాయణపేట, మక్తల్, గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కోస్గి, మద్దూరు, కొత్తకోట ఓట్ల లెక్కింపును ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోనే చేపడుతున్నారు. టేబుళ్లల వారీగా లెక్కింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీంతో ఒకటి, రెండు రౌండ్లలోనే ఫలితాలు వెళ్లడయ్య అవకాశం ఉంది. ఇక మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గానూ ఓట్ల లెక్కింపును 15 డివిజన్లకు ఒకసారి లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కార్పొరేషన్ ఫలితాలు మాత్రం సాయంత్రం పూర్తి స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకమున్సిపాలిటీల ఫలితాలు రెండు మూడు గంటల్లోనే వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జోరుగా బెట్టింగులు..
కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు ఓటములపై పట్టణాల్లో భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. ఫలానా వార్డులో ఫలానా పార్టీ గెలుస్తుందని మున్సిపాలిటీని ఆ పార్టీ కైవసం చేసుకుంటుందని చెబుతూ భారీగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ.5000 నుంచి రూ.50 వేలు లక్ష వరకు బెట్టింగులు పెట్టినట్లు సమాచారం. ఇక మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. 60 డివిజన్లో మేయర్ స్థానం కోసం డిప్యూటీ మేయర్ స్థానం కోసం పోటీపడుతున్న అభ్యర్థుల డివిజన్లో గెలుపోటముల పై రూ.లక్షల్లో పందేలు కాశారు. ఓటర్లను ప్రలోభపెట్టడం ఒకే అయితే అభ్యర్థుల గెలుపోటములపై పందెం కాయడం మరొక ఎత్తుగా మారింది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో కార్పొరేషన్లు తొలి మేయర్ పదవి ఎవరు చేజెక్కించు కుంటారోనన్న ఆసక్తి నెలకొంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు జరుగుచున్న దృష్ట్యా ఆయా పట్టణాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా మినహాయిస్తే మిగతా అన్ని మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపును ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని పట్టణాల్లో చేపడుతున్నారు. దీనికోసం ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం స్ట్రాంగ్ రూము ల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను లెక్కింపు కేంద్రాలకు తీసుకువస్తారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి బ్యాలెట్ పత్రాలను ముందుగా 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత ఆ కట్టలు ఓపెన్ చేసి గుర్తులు వారీగా పెట్టిన ట్రేలలో వాటిని వేసి తర్వాత లెక్కిస్తారు.
ఒక్కో టేబుల్లో ఒక్కో వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుం ది. వార్డులు తక్కువ ఉన్నచోట ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. వార్డులు ఎక్కువ ఉన్నచోట్ల రెండు రౌండ్లలో లెక్కించే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఓట్ల లెక్కింపు రాత్రి వరకు జరిగే అవకాశం ఉన్నది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ర్యాలీలు ప్రదర్శనలపై నిషేధం విధించారు. పోలీసులు అనుమతి లేనిది ఎలాంటి ర్యాలీలు చెపట్టరాదని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరుగు తున్నందున ఆయా జిల్లాలో పోలీసు యంత్రాంగం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు అధికార యంత్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను చేజిక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే. అందుకోసం అన్ని మున్సిపాలి టీలు, పాలమూరు కార్పొరేషన్లో బరిలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు, ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. బుధవారం ఆయా మున్సిపాలిటీలలో పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్‌రూంలకు తరలించి భద్రపర్చారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల ఓట్ల లెక్కింపును ఉయ్యాలవాడ సమీపంలోని మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న నైస్ స్కూల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగనున్నది. 8 టేబుళ్లు ఏర్పాటు చేసి, ప్రతి టేబుల్‌కు ముగ్గురు చొప్పున.. మొత్తం 24 మంది కౌంటింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్లో 8 వార్డుల చొప్పున లెక్కింపు జరిపి, మొత్తం 3 రౌండ్లలో పూర్తిస్థాయి ఫలితాలు ప్రకటించనున్నారు. కొల్లాపూర్‌కు సంబంధించి లెక్కింపును పట్టణంలోని పీజీ కళాశాలలో ఏర్పాటు చేయగా.. 7 టేబుళ్లు ఏర్పాటు చేయనుండగా.. 21 మంది అధికారులు కౌంటింగ్‌లో పాల్గొననున్నారు. కల్వకుర్తి పురంలోని 22 వార్డులకు సంబంధించి ఎస్బీఎంఎస్ బీఎడ్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అధికారులు 8 టేబుల్స్ సిద్ధం చేయగా.. 24 మంది అధికారులు మూడు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.
మద్దూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనుండగా.. 8 టేబుళ్లు.. (రెండు గదుల్లో), రెండు రౌండ్లలో.. కోస్గిలోని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనున్నది. వనపర్తి ఓట్లను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో, పెబ్బేరుకు సంబంధించి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో, కొత్తకోట లెక్కింపు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ఆత్మకూరు లెక్కింపు జిల్లా పరిషత్ పాఠశాలలో, అమరచింతకు సంబంధించి జెడ్పీ హైస్కూల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక గోన్‌పాడ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను లెక్కింపునకు అధి కారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 76 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. 76 మంది సూపర్వైజర్లు, 152 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు.. కలిపి మొత్తం 228 మంది సిబ్బందిని విధులు నిర్వర్తించేందుకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపున కు అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
వనపర్తి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసిం ది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వనపర్తి ము న్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయగా, పెబ్బేరులో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, కొత్తకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరులో జిల్లా పరిషత్ పాఠశాల, అమరచింతలో జెడ్పీ హైస్కూల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రి య ప్రారంభమవుతుందని, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ ఉంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. కేంద్రాల్లో కట్టుదిట్టమైన మూడంచెల పోలీసు భద్రతా చర్యలు చేపట్టామని, లెక్కింపు కేంద్రాలకు ఫోన్లకు అనుమతి లేదని, ఎలాం టి గుర్తింపులేని వారు కేంద్రాలకు వెల్లడం కుదరదన్నారు. పోటీ చేసిన అభ్యర్థితోపాటు ఒక ఏజెంట్‌ను మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందని కలెక్టర్ మీడియాతో వెల్లడించారు.
ఎవరి అంచనాల్లో వారు..
ఎవరిని కదలించినా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పైనే చర్చించుకుంటున్నారు. సాధారణ కార్యకర్తల నుంచి ప్రాధాన్యతగల నాయకుల వరకు ఇదే పనిలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తాజామాజీ కౌన్సిలర్లు, గతంలో పని చేసిన వారు, కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. ఎప్పుడు ఎన్నికల ఫలితం వస్తుందన్నట్లు కళ్లు.. చెవులన్నీ కౌంటింగ్ కేంద్రాల వైపే దృష్టి పెట్టాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఎవరికి వారుగా ఫలితాల అంచనాల్లో పడ్డారు. ఏజెంట్లతో ఉన్న ఓటరు లిస్టుల ద్వారా పోలింగ్ జరిగిన తీరును అంచనాలు వేసుకొని అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు.