ఎదులాపురం, ఫిబ్రవరి 12 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తీసుకొస్తున్న కలపను పట్టుకున్నామని ఏడీఎఫ్ విశ్వనాథ చినబూసరెడ్డి తెలిపారు. గురువారం అటవీ శాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి డీఎఫ్‌వోకు వచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్ తన సిబ్బందితో దస్నాపూర్ వద్ద మ్యాక్స్ వాహనాన్ని తనిఖి చేయగా కలప లభ్యమైందన్నారు.
18 దుంగలను గుర్తించి తరలిస్తున్న వాహనం డ్రైవర్ షేక్ అబ్బుతోపాటు దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అయితే అదే సమయంలో అతనితో ఉన్న మరో ఇద్దరు పరారైనట్టు తెలిపారు. ఇచ్చోడకు చెందిన గుత్తేదారుడు క్రాంతి ఆదిలాబాద్‌లో ఇంటి నిర్మాణానికి గుండాలలోని హతీంను సంప్రదించారని, ఆయన దుంగలను సమకూర్చి తరలిస్తున్న క్రమంలో పట్టుకున్నామని తెలిపారు.
డ్రైవర్, గుత్తేదారుడు క్రాంతితోపాటు కలప ఇచ్చిన హతీం, వామన్లపై కేసు నమోదు చేశామన్నారు. కలప విలువ దాదాపు రూ. 64 వేలు ఉంటుంది. వారి వెంట సెక్షన్ ఆఫీసర్ గులాబ్‌సింగ్, మావల బీట్ ఆఫీసర్ కృష్ణనాయక్ ఉన్నారు. కాగా.. అక్రమ కలప రవాణా వెనుక అటవీ సిబ్బంది హస్తం ఉందా? అనే కొణంలో కూడా జిల్లా ఆటవీ అధికారులు దర్యప్తు చేస్తున్నారు.
ఇచ్చోడ, ఫిబ్రవరి 12 ః అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు ఇచ్చోడ ఎఫ్ఆర్వో పుండలిక్ తెలిపారు. గురువారం మండలంలోని నవేగాం గ్రామంలో డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. గ్రామానికి కిశోర్ నిల్వ ఉంచిన టేకు కలపను పట్టుకున్నామన్నారు. వీటి విలువ రూ.13,400 ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.