సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 4 : సైబర్ నేరస్తుని వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసి డబ్బులను తిరిగి రప్పించుకున్నాడు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడికి న్యాయం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలోని కుశాల్‌నగర్‌కు చెందిన వెంకటమురళీకృష్ణ అనే వ్యక్తి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఓటీపీ నంబర్ కోసం నూతన మొబైల్ నంబర్ యాడ్ చేసేందుకు గూగుల్‌లో సెర్చ్ చేశాడు. కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేయగా గుర్తుతెలియని వ్యక్తి లైన్లోకి వచ్చి ఎనీడెస్క్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. వెంటనే బాధితుడు డౌన్లోడ్ చేసుకున్నాడు. నేరస్తుడు చెప్పిన విధంగానే క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ నంబర్, మొబైల్ నంబర్, సిక్స్ డిజిట్ నంబర్ వరుసగా తెలిపాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెంకట మురళీకృష్ణ అకౌంట్లో ఉన్న రూ.54,900 డెబిట్ అయ్యాయని తెలిపారు. తిరిగి అతనికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. సైబర్ నేరస్తుడు నమ్మించి డబ్బులు కాజేశాడని తెలుసుకొని జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. వెంటనే బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి సైబర్ నేరస్తుని ఖాతాను లాక్ చేశామని సీపీ వివరించారు. బాధితుడు పోగొట్టుకున్న రూ.54,900 లను ఫ్రీజ్ చేశామన్నారు. త్వరలోనే డబ్బులను బాధితుడి అకౌంట్లో జమఅవుతాయని పేర్కొన్నారు.