Gates Foundation : జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ రాకెట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్లో.. ఎస్స్టీన్కు, దాతృత్వ సంస్థ గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) సిబ్బందికి మధ్య సంభాషణ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తాము అతడిని ఎప్పుడూ నియమించుకోలేదని, అతడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
‘ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలను సమకూరుస్తానని అప్పట్లో ఎప్స్టీన్ చెప్పడంతో ఫౌండేషన్ సిబ్బంది కొందరు అతడితో సంభాషణలు జరిపారు. అయితే తర్వాత ఈ విషయంలో ముందుకువెళ్లలేదు. అతని పరిచయాల ద్వారా ఫౌండేషన్ కోసం ఎలాంటి నిధి ఏర్పాటు చేయలేదు. విషయం ఏదైనా ఫౌండేషన్ సిబ్బంది అతడితో మాట్లాడటంపై మేం చింతిస్తున్నాం’ అని గేట్స్ ఫౌండేషన్ తన ప్రకటనలో తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, అతడి మాజీ భార్య మిలిందా గేట్స్ 2000 సంవత్సరంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ను స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి బిల్గేట్స్ ఛైర్మన్గా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా ప్రభుత్వం 30 లక్షల ‘ఎప్స్టీన్’ పేజీలను బయటపెట్టింది. వాటితోపాటు 2,000 వీడియోలు, 1,80,000 ఫొటోలనూ విడుదల చేసింది.
జైల్లోనే మరణించిన మిలియనీర్ ఫైనాన్షియర్ ఎప్స్టీన్ ఆధ్వర్యంలో మైనర్ బాలికలపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాయి. ఈ విషయంలో ఎప్స్టీన్.. ట్రంప్, బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూలతో జరిపిన సంభాషణలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.