
సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురును అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఎన్జీవోస్, ఉపాధ్యాయులు, ఇతర అన్ని శాఖల ఉద్యోగులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వేతనాన్ని జూన్ నెల నుంచి ప్రభుత్వం అమలు చేయనున్నది. సిద్దిపేట జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి సుమారుగా 9వేల మంది ఉద్యోగులు, 5,244మంది పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 600మంది ఉన్నారు. మెదక్ జిల్లాలో 6,780 మంది ఉద్యోగులు, 3,345మంది పెన్షనర్లు ఉండగా, సంగారెడ్డి జిల్లాలో 10,853 మంది ఉద్యోగులున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సుమారుగా 35,222 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారుగా మరో 1500మంది నుంచి 2వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ నిర్ణయంతో అన్ని శాఖల ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. పక్క రాష్ర్టాల కన్నా మెరుగైన ఫిట్మెంట్ను సీఎం కేసీఆర్ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామంటున్నారు. తమపై మరింత బాధ్యత పెరింగిందని అన్ని శాఖల ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాలు సవరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పని చేస్తున్న ఇతర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, తదితర ఉద్యోగులందరికీ వర్తించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేజీవీబీల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు వేతనంలో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం ప్రభుత్వం కల్పించించడంతో వారు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.