సిద్దిపేట,జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడుల బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు కొనసాగించాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సర్కారు బడులపై చిన్నచూ పు చూడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరా రు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి మంచి భవిష్యత్తుకు బాట లు వేసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా తాము, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే విద్యార్థులకు మంచి జరుగుతుందన్నారు. సిద్దిపేటలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దినట్లు తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో హాస్టల్‌కు వెంటనే డైనింగ్ రూమ్ మంజూరు చేయించి ప్రారంభించుకుందామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం సర్కారు సూళ్లలో పారిశుధ్య సిబ్బంది నియమించడంతో పాటు ఉచిత కరెంట్ సరఫరా చేయాలని కోరారు. యుద్ధప్రాతిపదికన పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభు త్వం గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టి మెరుగైన విద్య అందించిందని గుర్తుచేశారు. సిద్దిపేట బాలుర ప్రభుత్వ పాఠశాలలో 98శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఉపాధ్యాయ బృందానికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.గతేడాది సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది మొదటి స్థానంలో నిలవాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొంత డబ్బులు రూ.5 లక్షలతో గతేడాది స్నాక్స్ అందించినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు.