రాయపోల్, జూలై 30: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. టీచర్ భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎం.హర్షవర్దన్, పి.కార్తీక, ఎం.చైతన్యలు రూపొందించిన స్మార్ట్ వాకింగ్ స్టిక్‌ను ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ 2025’ ప్రదర్శించారు.
స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ 2025లో భాగంగా గత డిసెంబర్ 2024లో జాతీయ స్థాయిలో 1.05 లక్షల వైజ్ఞానిక ప్రాజెక్టులను ఆన్లైన్లో ప్రదర్శించారు. వివిధ దశల్లో వాటిలో అత్యుత్తమ 27 ఆవిష్కరణలను ప్రకటించారు. ఆ 27 ఆవిష్కరణల్లో బేగంపేట విద్యార్థుల ఆవిష్కరణ ఎంపిక కావడం విశేషం. ఈ ఆవిష్కరణలను న్యూఢిల్లీలోని గాల్గోటియాస్ యూనివర్సిటీలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ప్రదర్శిస్తున్నారు. కాగా, ఈ నెల 29న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈ 27 ఆవిష్కరణలు చేసిన బాల ఇన్నోవేటర్లను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గైడ్ టీచర్ భాస్కర్ రెడ్డిని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి అభినందించారు.