హుస్నాబాద్, మార్చి 7: ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆమె సందర్శించారు. విద్యార్థులు హాస్టల్ భవనంతో పాటు కిచెన్, నిత్యావసర సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల భోజనానికి ఉపయోగించే నిత్యావసర సరుకులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కాలం చెల్లిన సరుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని సూచించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నందున వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పట్టణంలో ప్రధాన కూడళ్ల పరిశీలన
హుస్నాబాద్ పట్టణంలో పలు కూడళ్లను సుందరీకరణ చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమైనందున పలు కూడళ్లను అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. పట్టణంలోని రామవరం రోడ్డులో పాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల కూడలి, ఆరెపల్లి చౌరస్తా, కొత్తచెరువు వై జంక్షన్లను సందర్శించి ఆయా ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేసేందుకు సాధ్యాసాద్యాలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. కూడళ్ల ఆధునీకరణ పనులకు పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, మైనార్టీ గురుకులం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.