Kalyana Lakshmi | సిద్దిపేట, మే 21( నమస్తే తెలంగాణ ప్రతినిధి):’ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది .. మేం ఏం చెబితే అదే నడుస్తుంది. మేం అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు పనులు అవుతాయి. ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే పనులు అవుతాయి.’.. ఇలా చెప్పి లబ్ధిదారుల వద్ద సిద్దిపేట జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఏదో ఒక రకంగా డబ్బులు తీసుకునే పనిగా పెట్టుకున్నారు.
ఇటీవల కాలంలో కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి అందినకాడికి పైసా వసూలు చేస్తున్నారు. వీరికి రెవెన్యూ కింది స్థాయి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకానికి ఆదాయ, కుల సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన పనులు కావడం లేదు. ప్రతి దానికి ఒక రేటు ఉంది. ఆ రేటు ప్రకారం డబ్బులు ముట్ట జెప్పితేనే పనులు అవుతున్నాయని పేద ప్రజలు వాపోతున్నారు. కింది స్థాయి సిబ్బంది ద్వారా పైసలు వసూలు చేస్తున్నారన్న విమర్శలు జిల్లాలో బలంగా ఉన్నాయి. నెలల తరబడి కళ్యాణలక్ష్మీ చెక్కులు అందక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో చెక్కులు మంజూరైనప్పటికీ వాటిని పంపిణీ చేయకుండా ఆపివేస్తున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. జిల్లా మంత్రి సమయం ఇవ్వక పోవడంతో చాల చోట్ల పెండింగ్‌లో పెట్టారని విమర్శలు సైతం ఉన్నాయి.
సిద్దిపేట జిల్లాలో వందల సంఖ్యలో కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా మండలాల్లో తహసీల్దార్ లాగిన్‌లోనే పెండింగ్‌లోనే పెట్టారు. దాదాపు అన్ని మండలాల్లో లబ్దిదారుల నుంచి చోటా బడా నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తును క్లియర్ చేయడానికి తహసీల్దార్ కార్యాలయంలోనే కాసుకొని కూర్చున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలకు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటారు. ఇట్టి దరఖాస్తును స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లబ్దిదారుడు అప్పజెబుతాడు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్థానిక తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లుతుంది. అక్కడ తహసీల్దార్ దానిని పరిశీలించి ఆర్డీవోకు పంపుతారు. ఇలా ప్రాసెస్ పూర్తి అయ్యాక లబ్దిదారునికి పథకం మంజూరు అవుతుంది. కానీ ఇక్కడే అసలు మోసం జరుగుతుంది. అయా మండల కేంద్రాల్లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మక్కవుతున్నారు. కార్యాలయానికి వచ్చిన దరఖాస్తు లిస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేరవేస్తున్నారు. ఆ జాబితా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్దిదారునికి ఫోన్లు చేసి మీరు కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు కదా.. తమకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే పనులు అవుతాయి. అంటూ బెదిరిస్తున్నారు. చేసేది ఏం లేక లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు డబ్బులు ముట్ట జెబుతున్నారు.