సిద్దిపేట: వృద్ధులు, వికలాంగులు, పిల్లల పట్ల ఎప్పుడూ ఆప్యాయత, గౌరవభావంతో మెలుగుతూ ఉండే
జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. గౌరారం వద్ద 54 సంవత్సరాల మతిస్థిమితం లేని వృద్ధురాలు ఈశకంటి పోచమ్మ ప్రధాన రోడ్డుపై వాహనాలు వస్తున్నా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. దీంతో తనకు ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన ముజమ్మిల్ ఖాన్.. వెంటనే తన వాహనాన్ని ఆపారు.
వెంటనే వృద్ధురాలి దగ్గరికి వెళ్లి తనను ఆప్యాయంగా పలకరించారు. వృద్ధురాలి చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ వస్తుందా? ఇల్లు ఉందా అంటూ కుశల ప్రశ్నలు అడిగారు. పెన్షన్ వస్తున్నట్లు వృద్ధురాలు తెలిపింది. ఆ తర్వాత ఆమెను తన వాహనంలో తీసుకెళ్లి తన ఊరు మర్కుక్‌లో సురక్షితంగా దించారు. దించే సమయంలో తన భుజాలపై వృద్ధురాలిని స్వయంగా అదనపు కలెక్టర్ మోసుకెళ్లారు. గ్రామ పంచాయితీ వద్దకు తీసుకెళ్లి.. గ్రామ సర్పంచ్ భాస్కర్, గ్రామ పంచాయితీ సెక్రటరీ శాంతి, వృద్ధురాలి అన్నయ్య సాయిలు, బాలయ్యలకు ఆమెను అప్పగించారు. మతిస్థిమితం సరిగా లేని వృద్ధురాలి సంరక్షణ బాధ్యత కుటుంబ సభ్యులదేనని ఈసందర్భంగా అదనపు కలెక్టర్ తెలిపారు. వృద్ధురాలిని బాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు ఆయన హితబోధ చేశారు. ఇకముందు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.