రాయప్రోలు, మే 17 : ఇటీవల జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ ఎస్ఐ మానస సూచించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ..గ్రామాల్లో ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నప్పటికి ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని ఆమె తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాత్రి సమయంలో ఇళ్ల ముందు లేదా ఆరుబయట పడుకునే వారు బంగారు ఆభరణాలు ధరించి ఉండకూడదన్నారు. ఒంటరిగా ప్రయాణించే సమయంలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే గ్రామ పెద్దలకు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో అపరిచితులు సంచరిస్తే వారి వివరాలు తెలుసుకోవాలని, అవసరమైతే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
పోలీసులు ప్రజల రక్షణ కోసం ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నారని, ప్రజలు కూడా సహకరించి నేరాల నివారణలో భాగస్వాములు కావాలని ఎస్ఐ మానస తెలిపారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. చిన్నచిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారిస్తాయి. అందరూ అప్రమత్తంగా ఉండి తమ కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలి అని ఎస్ఐ మానస పేర్కొన్నారు.