చేతులు కాలాక ఆకుల కోసం వెతికినట్లుంది సర్కారు పనితీరు. సంగారెడ్డి జిల్లా సంజీవన్‌రావుపేట్‌లో మిషన్ భగీరథ నీరు సరఫరా కాని పరిస్థితుల్లో కలుషిత బావి నీటిని తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వంద మందికి పైగా అస్వస్థతకు గురైన విషాదకర సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం పట్టణాలు మొదలుకుని మారుమూల తండాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించిందనడంలో అతిశయోక్తి లేదు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు నారాయణఖేడ్ నియోజకవర్గంలో కలుషిత నీరు తాగి ఇంత పెద్ద ఎత్తున అస్వస్థతకు గురైన ఘటనలు కాని మరణాలు సంభవించిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. మండుటెండల్లోనూ ప్రతి తండాకు తాగునీటి దాహార్తి తీర్చిన ఘనత మిషన్ భగీరథ పథకానిది. కేసీఆర్ ప్రభుత్వంలో సమర్థవంతంగా అమలైన మిషన్ భగీరథ పథకం ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఎందుకు కొనసాగడం లేదనే ప్రశ్నకు ఈ పథకంపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయనే సమాధానమే వినిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అధికారులే ఇప్పుడూ పథకాన్ని పర్యవేక్షిస్తుండడం, వందశాతం పనులు పూర్తిచేసి నిరాటంకంగా నీరందిస్తున్న క్రమంలో ఎనిమిది నెలల్లో తరుచూ నీటి సరఫరా నిలిచిపోవడం, నీటి సరఫరా పునరుద్ధరణకు రోజుల తరబడి జాప్యం జరగడం గమనిస్తే ఈ పథకంపై ప్రభుత్వ చిత్తశుద్ధి కొరవడిందనే విషయం తేటతెల్లమవుతున్నది.
సాంకేతిక లోపంతోనే నీటి సరఫరాకు అంతరాయం..
మిషన్ భగీరథలో భాగంగా పెద్దారెడ్డిపేట్ సబ్‌స్టేషన్‌లో గొర్రెకల్ వద్ద ఏర్పాటు చేసిన రెండు మోటర్లలో తలెత్తిన సాంకేతిక లోపాలతో నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీటి సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. దసరా పండుగకు ముందు నీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో పండుగను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాల్సి ఉండగా, పండుగకు మూడు రోజుల ముందు పండుగ మరుసటి రోజు వరకు నీటి సరఫరా జరగలేదం టే అధికారుల అలసత్వం, ప్రభు త్వ పర్యవేక్షణాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. గతంలో ఎలాంటి లోపాలు తలెత్తినా ఆగమేఘాల మీద అధికారులు రంగంలోకి దిగి సత్వరమే లోపాన్ని సవరించి నీటిని పునరుద్ధరించేవారు. సంజీవన్‌రావుపేట్ ఘటనతో మిషన్ భగీరథ నీటి సరఫరాపై జరుగుతున్న నిర్లక్ష్యం వెలుగు చూసినప్పటికీ, కొన్ని నెలలుగా తరుచూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. లోపా న్ని సవరించి నీటిని పునరుద్ధరించడంలో జరిగిన జాప్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ప్రత్యామ్నాయం కరువైన అనివార్యత..
నారాయణఖేడ్ మండలంలో పెద్ద పంచాయతీల్లో సంజీవన్‌రావుపేట్ ఒకటి. ఈ గ్రామంలో 800 కుటుంబా లు, 3700ల జనాభా ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామానికి సరిపడే రీతిలో నాలుగు ఓహెచ్ఎస్ఆర్ నీటి ట్యాంకులను నిర్మించి, అందుకు అవసరమైన పైప్‌లైన్, ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు గ్రామంలో 12 బోరు మోటర్లు ఉండగా, నిర్వహణా లోపంతో తొమ్మిది బోరు మోటర్లు కుం టుపడగా, కేవలం మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. కుంటుపడిన బోరుమోటర్లను పునరుద్ధరించిన పక్షంలో బోరుమోటర్లను వినియోగించుకునే వారమని, ఈ ఉపద్రవం తమ గ్రామానికి వచ్చేది కాదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలోని ఒక కాలనీకి నీటిని అందించేందుకు అధికారులు బావి నీటిని ట్యాంకు ద్వారా కాలనీ ప్రజలకు సరఫరా చేయడమే కలుషితనీటికి కారణమైంది. సదరు బావిలో కుక్కలతో పాటు ఇతర జంతువులు, పక్షుల కళేబరాలు ఉండడం, అదే బావిలోని నీటిని సరఫరా చేయడం కూడా ప్రభుత్వ సిబ్బందికి ప్రజలపై పట్టింపులేని తనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మిషన్ భగీరథ పథకానికి ప్రత్యామ్నాయం కరువైన అనివార్య పరిస్థితుల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు పేర్కొనడం గమనార్హం.
ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ప్రజాగ్రహం
సోమవారం సంజీవన్‌రావుపేట్ గ్రామానికి సందర్శించిన స్థానిక నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గ్రామస్తుల ఆగ్రహానికి కారణమయ్యాయి. మిషన్ భగీరథ పథకం విఫలం కావడం, నీరు సక్రమంగా సరఫరా కాకపోవడం మూలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. దీంతో గ్రామస్తులు జోక్యం చేసుకుని పథకం ప్రారంభమైనప్పటి నుంచి నీరు సక్రమంగా సరఫరా చేశారని, నీరు సరఫరా అయినప్పుడు ఎలాంటి సమస్య రాలేదన్నారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తలెత్తిన సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కలుగజేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులను నిలువరిచారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, మిషన్ భగీరథ నీరు సరఫరా కాని సందర్భాల్లో తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి
మిషన్ భగీరథ పథకం నిర్వహణలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణితోనే మా గ్రామంలో ఈ దుస్థితి వచ్చింది. రోజుల తరబడి నీటి సరఫరా జరగకపోయినా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం దారుణం. ఇదే విషయమై గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డిని ప్రశ్నిస్తే గత ప్రభుత్వంపై, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం. గ్రామంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థిని అదుపు చేసే విషయమై చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యే రాజకీయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సంజీవన్‌రావుపేట్‌లో నెలకొన్న సమస్య వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.
-భూపాల్, మాజీ ఎంపీటీసీ, సంజీవన్‌రావుపేట్
మిషన్ భగీరథ నీరు రాకపోవడమే కారణం
దసరా పండుగకు మూడు రోజుల ముందు నుంచే మా ఊరికి మిషన్ భగీరథ నీరు రావడం లేదు. ఊరిలో వెటర్నరీ దవాఖాన దగ్గర ఉన్న బావిలో ఏర్పాటు చేసిన మోటరు ద్వారా బీసీ కాలనీలోని ట్యాంకుకు నీరు ఎక్కించి ఆ కాలనీ అంతటికి సైప్లె చేశారు. ఆ మరుసటి రోజు నుండి ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతూ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. బావిలో జంతువుల కళేబరాలు ఉన్నాయి. నీరు చాలా మురికిగా ఉండడం ఇవన్నీ అధికారులు గమనించాలి. పండుగకు ఎలాగైనా నీరందించాలనే ఆత్రుతలో చేసిన తప్పిదం మా గ్రామస్తులకు శాపంగా మారింది. – రాకేష్‌రెడ్డి, సంజీవన్‌రావుపేట్
ఇది అధికారుల నిర్లక్ష్యమే
ఊరిలో ఇంత మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురి కావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. నీటి సరఫరాను పునరుద్ధరించకపోవడం, కలుషితమైన బావిలోని నీటిని సరఫరా చేయడం ఇదంతా అధికారుల పొరపాటుగానే చూడాలి. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి. పరిస్థితి పూర్తిగా తగ్గే వరకు వైద్యాధికారులు గ్రామంలో శిబిరం నిర్వహించాలి. జిల్లా అధికారులు కూడా పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నా. -ఉమైలా సాయిలు, సంజీవన్‌రావుపేట్