సిద్దిపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ( Harish Rao) పేర్కొన్నారు. సిద్దిపేటలోనీ పోలీస్ కన్వేషన్ హల్ లో ట్రష్మా జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం(Teachers Day) , ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే సన్మానించిందని ఆరోపించారు. గురువులంత సమానమేనని, ప్రైవేట్ ఉపాధ్యాయులను (Private Teachers) కూడా సన్మానించాలని సూచించారు. పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట మొదటి, రెండవ స్థానాల్లో ఉండడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉందని అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడుతున్నారని, ప్రైవేట్ ఉపాధ్యాయులకు సాలరీ లో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదని అన్నారు.
పిల్లలను ఎక్కువగా చదివించడమే తరగని ఆస్తి అని తల్లిదండ్రులు గుర్తించారని తెలిపారు. నియోజక వర్గం పునర్వీభజనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. బెస్ట్ అవెలెబుల్ స్కూల్స్ కి ప్రభుత్వం వచ్చి పదినెలలు అవుతున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.