రాయపోల్, ఫిబ్రవరి 6 : మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం తొగుట సీఐ లతీఫ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ సురేష్ (25), రాగి రాము (28) ఇద్దరూ ఇటీవల రాంసాగర్‌లో సర్కస్‌ను చూడటానికి వెళ్లారు. సర్కస్ చూసిన అనంతరం ఇద్దరూ మద్యం సేవించారు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో రాము అక్కడి గాంధీ విగ్రహాన్ని చూపిస్తూ “ఇక్కడ గాంధీ విగ్రహం స్థానంలో వేరే విగ్రహం ఉంటే బాగుంటుంది” అని సురేష్‌తో అన్నాడు.
గాంధీ విగ్రహం స్థానంలో మరో విగ్రహం ఉంటే బాగుంటుంది అని రాము అనడంతో.. రెచ్చిపోయిన సురేష్ అక్కడే ఉన్న రాయితో గాంధీ విగ్రహంపై కొట్టాడు. దాంతో, విగ్రహం తల భాగం విరిగి వంగిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయపోల్ ఎస్సై మానస, పక్కా సమాచారం మేరకు నిందితులైన రాము, సురేష్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. వారి నుంచి AP 24 AK 6438 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ లతీఫ్ వెల్లడించారు. ప్రజా ఆస్తిని ధ్వంసం చేయడం, జాతీయ నాయకుడి విగ్రహాన్ని అవమానించడం వంటి చర్యలను సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.