రాయపోల్, ఆగస్టు2: ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి డ్రోన్ కెమెరా కొనాలని అనుకున్న బాలుడిని సైబర్ నేరగాళ్లు నిలువునా ముంచేశారు. ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే డ్రోన్ కెమెరాను డెలివరీ చేస్తామని నమ్మించి, విడతల వారీగా 2లక్షల 39 వేల రూపాయలను కొట్టేశారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సయ్యద్నగర్కు చెందిన అలీ బీబీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె భర్త అలీ హుస్సేన్ దుబాయిలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడ సంపాదించిన డబ్బును భార్య అలీ బీబీ ఖాతాలో జమ చేసేవాడు. ఆ బ్యాంకు ఖాతాకు కొడుకు అజ్ముద్దీన్ ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉంది. దీంతో అతని ఫోన్లోని ఫోన్ పే, గూగుల్ పే వంటి ద్వారానే ఆన్లైన్ పేమెంట్లు చేస్తూ గృహవసరాల కోసం సరుకులు తీసుకొస్తుండేవారు.
ఇదిలా ఉండగా అజ్ముద్దీన్ రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుండగా.. డ్రోన్ కెమెరా అమ్మబడును అని ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉండటంతో.. అజ్ముద్దీన్ కాల్ చేసి తనకు డ్రోన్ కెమెరా కావాలని అడిగాడు. దీనికి అవతలి నుంచి రూ.50 వేలు పంపిస్తే డ్రోన్ కెమెరాను డ డెలివరీ చేస్తామని సమాధానమిచ్చారు. అది నమ్మిన అజ్ముద్దీన్ రూ.50 వేలు పంపించాడు. కానీ అవతలి వాళ్లు డబ్బులు రాలేదని చెప్పాడు. దీంతో జూలై 31, ఆగస్టు 1వ తేదీన పలుమార్లు ఫోన్ పే ద్వారా అజ్ముద్దీన్ డబ్బులు పంపించాడు. తీరా చూస్తే బ్యాంకులో ఉండాల్సిన రూ.2.39లక్షలు ఖాళీ అయ్యాయి. కానీ డ్రోన్ కెమెరా మాత్రం పంపించలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న అజ్ముద్దీన్ మామ అబ్జర్ రాయపోల్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.