రాయపోల్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మంతూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి ప్రైవేట్‌కు పంపకుండా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల్లో అనుభవంగల ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని, పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తారని అన్నారు.
ఉచితంగా స్కూల్ యూనిఫామ్, నోటు పుస్తకాలు ఇస్తారని చెప్పారు. ప్రైవేట్ పాఠశాల్లో చేర్పిస్తే అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తారని, అన్ని వసతులు కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరానికి పూర్వ ప్రాథమిక విద్యలో చేరిన విద్యార్థులకు, ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు సరస్వతీ పూజ నిర్వహించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.
రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నాగరాజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ మంగమ్మ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, రాయపోల్ కాంప్లెక్స్ సీఆర్పీ ఎల్ల గౌడ్, వీఏవో, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.