రాయపోల్, సెప్టెంబర్ 10 : భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ గౌరిగారి పరశురాములు అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో బుధవారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎస్ఐ మానస ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదటి మహిళ ఉద్యమకారిణి అయిన ఐలమ్మ తన పోరాటంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని కోనియాడారు.
అక్రమ కేసులు బనాయించి వారి కుటుంబాన్ని చిత్రహింసలు చేసినప్పటికి మడమ తిప్పకుండా దొరల గుండాలతో పోరాడి తరిమికొట్టిన ధైర్యశాలి అని ప్రశంసించారు. ఆమె చేసిన పోరాట స్ఫూర్తితోటి అక్రమంగా కబ్జా చేసిన పేదల భూములు దొరల వద్ద నుండి కొన్ని ఎకరాల భూమిని దళిత బహుజనులకు భూ పంపిణీ చేశారన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని దళిత బహుజన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం మరింత ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా యువజన అధ్యక్షులు కరుణాకర్, మహిళా నాయకురాలు మైసిగారి బుధవ్వ. చింతకింది కృష్ణ. చింతకింది మంజూరు స్వామి. చెప్యల స్వామి, చక్రి, పీర్లపల్లి రవి, చింతకింది స్వామి, మైసిగారి బిక్షపతి, చింతకింది హరి, చింతకింది స్వామి తదితరులు పాల్గొన్నారు.