Paddy Crop | రాయపోల్, మార్చి 30 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భూగర్భజలాలు అడుగంటిపోయి సాగునీరు కరువై రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో భూగర్భ జలాలు తీవ్రస్థాయిలో అడుగంటి పోతున్నాయి. సాగునీటి కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి ఎన్ని బోర్లు వేసినా నీరు రాకపోవడంతో.. వేసిన పంటలు పూర్తిగా చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నాయి.
పంట పొలాలకు సాగునీరు అందించే పిల్ల కాలువలు మధ్యలో ఆగిపోవడంతో రైతులకు నీళ్లు అందక వరి పంట పశువులకు మేతగా మారింది. ఇందులో భాగంగానే దౌల్తాబాద్ మండలంలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన బొట్క తిరుపతి అనే రైతు తనకు ఉన్న మూడు ఎకరాల భూమిలో యాసంగి వరి సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయింది. గత పది సంవత్సరాల నుండి ఎప్పుడు సాగునీళ్లకు కరువు రాలేదని. ప్రస్తుతం మళ్లీ సాగునీటి ఘోష వచ్చిందని రైతు తిరుపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పిల్ల కాలువలు పూర్తికాక పోవడంతో పాటు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో మూడు ఎకరాల వరి పశువులకు మేతగా మారిందని ఆందోళన చెందుతున్నాడు. మరో మూడు ఎకరాలు పొద్దుతిరుగుడు పంట సాగు చేయగా అది కూడా నీళ్లు లేక ఎండు దశకు వచ్చిందని కనీసం పెట్టుబడులే రాని దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందాడు. రూ. లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పటికీ పంట నష్టపోవడంతో ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నాడు.
కేసీఆర్ పాలనలో పచ్చటి పంట పొలాలు..
గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో పచ్చటి పంట పొలాలు చూశామని.. ఇప్పుడు నీళ్లు లేక వరి పంట. మొక్కజొన్న పొద్దుతిరుగుడు. ఆరుతడి పంటలు ఎండిపోవడం రైతులకు మిగిలింది కన్నీరు మాత్రమే అంటూ బోరుమంటున్నాడు.
కండ్ల ముందే చేతికొచ్చిన పంటను పశువులకు మేతగా మారిపోవడం.. వరిని ప్రతి రోజూ కోయడం ఎంతో బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనతో పాటు గ్రామంలో చాలా మంది రైతులు నీళ్లు లేక పంటలను మధ్యలోనే వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం ఎండిన పంటలకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు బొట్క తిరుపతి పేర్కొన్నాడు. దౌల్తాబాద్ మండలంలోని చాలా గ్రామాల్లో బోరు బావుల్లో నీటిమట్టం తగ్గడంతో వరి పంట వేసిన రైతులు ఆశలు వదులుకుంటున్నారు. మరికొంతమంది రైతులు పంట దక్కించుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతూ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్