Sanitation | రాయపోల్, అక్టోబర్ 21 : గ్రామాల్లో పారిశుధ్యం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ గ్రామానికి చెత్త బండి ట్రాక్టర్లు, మొక్కల పెంపకానికి ప్రత్యేకంగా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో చెత్త బండి ట్రాక్టర్లు డీజిల్ ఖర్చులు లేకపోవడంతో గత నెల రోజుల నుంచి మూలన పడ్డాయి. మరోవైపు వాటర్ ట్యాంకర్ సైతం గ్రామపంచాయతీ ముందు ఉంచారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. మురికి కాలువలు తీయడం లేదని.. దీంతో రాత్రి అయిందంటే దోమలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రోజు చెత్త బండి ట్రాక్టర్ గల్లీగల్లీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించాల్సింది పోయి నిధులు లేవని సాకుతో ట్రాక్టర్లనూ నడిపించకుండా గ్రామపంచాయతీ వద్ద మూలకు వేశారని.. వాటర్ ట్యాంకర్ కూడా వినియోగంలోకి తీసుకురావడంలేదని.. దీంతో గ్రామంలో సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయన్నారు. పలుమార్లు ఈ విషయాలను సంబంధిత మండల అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీజిల్ ఖర్చులకు డబ్బులు లేవని..
చెత్త బండి ట్రాక్టర్ ప్రతిరోజు గల్లి గల్లి తిరిగి చెత్త సేకరించి ఉంటే తమ గ్రామంలో ఈ పరిస్థితి ఉండేది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. చెత్తబండ్లను ఎందుకు నడిపించడం లేదని సంబంధిత మండల అధికారులను అడిగితే డీజిల్ ఖర్చులకు డబ్బులు లేవని.. తాము కూడా ఏమి చేస్తామని చేతులెత్తేయడంతో గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిపోయింది. చెత్త సేకరించిన ప్రతి ఒక్కరూ బైకులపై వెళ్లి గ్రామ సమీపంలోని చెరువులో వేయడంతో చెరువులో నీరు కలుషితం అవుతుందని తెలిపారు.
గత ప్రభుత్వం అందించిన చెత్త బండి ట్రాక్టర్లను ప్రతిరోజు గల్లి గల్లి తింపితే చెత్త ఉండదని. గ్రామపంచాయతీ ట్రాక్టర్ తిరగకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ఎంతో ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తిమ్మక్కపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద నిరుపయోగంగా ఉన్న ట్రాక్టర్‌ను, వాటర్ ట్యాంకర్ ను వినియోగంలోకి తీసుకువచ్చి గ్రామంలో పారిశుధ్య పనులను ఉమ్మరంగా చేపట్టాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
Read Also :
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!