రాయపోల్, జూలై 5: గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని పల్లెల్లో పీర్ల పండుగ కొత్త శోభను తెచ్చిపెట్టింది. హిందువులు. ముస్లిం సోదరులు, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పీర్ల పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మొహర్రం సందర్భంగా గ్రామాల్లో పీర్ల ఊరేగింపు డప్పు చప్పుళ్ల మధ్య వీధి వీధిన తిరుగుతూ పీర్లను ఊరేస్తారు. సాయంత్రం మసీదు వద్ద ఆల్వా ఆటలు ఆడుతూ ‘అసైదుల హారతి’ పాటలు పాడుతూ పీర్ల పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.