సిద్దిపేట, మే 1: మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి మచ్చలేని నాయకుడు అని, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ అభ్యర్థి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని లాల్‌కమాన్ ఏరియాలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వస్తున్నందున రఘునందన్‌రావు ఓర్వలేక పోతున్నారని చెప్పారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో ఫేక్ వీడియోలు సృష్టించి కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్లోకి వెళ్తున్నాడంటూ తప్పుడు ప్రచారం చేసి గెలుపొందారన్నారు. బీజేపీ చేస్తున్న అబద్ధపు గోబెల్స్ వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దన్నారు.
చాలామంది నాయకులు ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సొంత ఆస్తిలో కొంత ప్రజలకు పంచి పెడతానంటూ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. మచ్చలేని మనిషి, కలెక్టర్‌గా ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెంకట్రామిరెడ్డికి ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు.
కేసీఆర్ కోరిక మేరకు వెంకట్రామిరెడ్డి మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నాడని, అందరిలా డబ్బు కోసం కాకుండా ప్రజాసేవ చేయడానికి బరిలో నిలిచాడన్నారు. బీజేపీ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం, మణిదీప్ రెడ్డి, బొంపల్లి శ్రీహరి, పూజల వెంకటేశ్వరరావు, బచ్చు రమేశ్, అయితే రత్నాకర్, పుల్లూరు శివ, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రజినీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు మేరకు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.