కోయగూడెం ఉపరితల గని (కేవోసీ)లో ప్రతిరోజూ మూడువేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. నాణ్యమైన బొగ్గును వేరుచేయగా ‘అన్గ్రేడ్ బొగ్గు’ నిల్వలు కొండలను తలపిస్తూ పేరుకుపోయాయి. రెండు మూడు నెలలుగా ఇదే పరిస్థితి. దీనికితోడు ప్రస్తుతం ఎండల కారణంగా బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. కేవోసీ అధికారులు నామమాత్రంగా నీళ్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. బొగ్గును ప్రైవేట్ పరిశ్రమలకు ఎలా విక్రయించాలనే దానిపై శ్రద్ధ చూపకపోవడం శోచనీయం. లక్షల టన్నుల మేర పేరుకుపోయిన అన్గ్రేడ్ బొగ్గును కేవోసీ అధికారులు సొమ్ము చేసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బొగ్గు నిల్వలు మంటల్లో బుగ్గి కావడంతో సింగరేణికి రూ.కోట్లలో నష్టం వాటిల్లుతున్నది. అంతేకాదు.. విపరీతమైన పొగతో వాయుకాలుష్యం ఏర్పడి చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి.
-ఇల్లెందు, మార్చి 3
ఇల్లెందు సింగరేణి ఏరియా పరిధి కోయగూడెం ఓసీలో ప్రతిరోజు 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా అందులో గ్రేడ్ బొగ్గు మాత్రమే సరఫరా చేస్తుండగా, అన్గ్రేడ్ బొగ్గు నిల్వలు కొండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఎండలకు అన్గ్రేడ్ బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. అధికారులు నామమాత్రంగా నీళ్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కోయగూడెం ఉపరితల గని నుంచి అన్గ్రేడ్ బొగ్గు ప్రైవేట్ పరిశ్రమలకు తరలించేలా ప్రతిరోజు వందల సంఖ్యలో బాడీ లారీలకు అనుమతి ఇచ్చేవారు.
కానీ, ప్రస్తుతం పరిమిత సంఖ్యలో బాడీ లారీలకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో మాదిరిగా బాడీ లారీలకు అనుమతి ఇచ్చి, ప్రైవేట్ పరిశ్రమలకు బొగ్గును విక్రయిస్తే అన్గ్రేడ్ బొగ్గు నిల్వలు ఎప్పుడో తగ్గిపోయేవి. కానీ, అధికారుల ఉదాసీనత కారణంగా లక్షల టన్నుల అన్గ్రేడ్ బొగ్గు నిల్వలు బుగ్గి అవుతూ సింగరేణి సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.
మరోవైపు బొగ్గుకు నిప్పంటుకొని వచ్చే పొగతో కేవోసీ సమీప గ్రామాలైన లచ్చగూడెం, కిష్టారం, దారపాడు, లక్ష్మీపురం, కొప్పురాయి, బోడు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై స్థానిక గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు సింగరేణి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొగ్గుకు అంటుకున్న మంటలను పూర్తిస్థాయిలో ఆర్పాలని, అన్గ్రేడ్ బొగ్గును సేల్ చేసేందుకు సింగరేణి అధికారులు చొరవ చూపాలని, ఓసీ ప్రభావిత ప్రాంత గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
పొగతో ప్రజలకు ముప్పు..
కేవోసీలో అన్గ్రేడ్ బొగ్గు నిల్వలు భారీఎత్తున ఉండంతో ఎండకాలం ప్రారంభం ఫిబ్రవరిలోనే ప్రతిరోజు కాలిపోవడంతో దానివల్ల వచ్చే పొగతో ఓసీకి సమీపాన ఉన్న లచ్చగూడెం, కిష్టారం, దారపాడు, లక్ష్మీపురం, బోడు తదితర గ్రామాల పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరిగిపోయింది. దీనివల్ల ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత ఎండలకే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎండలకు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
కేవోసీకి అతిదగ్గర ఉన్న గ్రామం మాది. కేవోసీలో ప్రతి సంవత్సరం వేసవిలో బొగ్గు కాలుతున్నది. దీనివల్ల పొగ చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తున్నది. దీంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం మూడునెలలకోసారి హెల్త్క్యాంపులు పెట్టేవారు.. కానీ, ఇప్పుడు ఎలాంటి హెల్త్క్యాంపులు లేవు. ఎవరూ పట్టించుకోవడమూ లేదు. ప్రజారోగ్యంపై సింగరేణి ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.
-జోగ లక్ష్మణ్, లచ్చగూడెం, టేకులపల్లి మండలం
మా సమస్యలను పరిష్కరించాలి
కోయగూడెం సింగరేణి ఉపరితల గని ప్రభావిత ప్రాంతంలో వాతావరణ కాలుష్యం, ప్రజారోగ్యంపై అధికారులు పట్టించుకోవడం లేదు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెబుతున్నారు కానీ, ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు. కేవోసీ అన్గ్రేడ్ బొగ్గు ఎండలకు మండుతూ పొగ, వాసన విపరీతంగా వస్తున్నాయి. గాలి కలుషితమై చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యం పాడుకాకముందే అధికారులు స్పందించాలి.
-జబ్బ విజయలక్ష్మి, కిష్టారం మాజీ సర్పంచ్, టేకులపల్లి
అన్గ్రేడ్ బొగ్గును క్లియర్ చేయాలి
సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో కాలిపోతున్న అన్గ్రేడ్ బొగ్గు రేట్ డౌన్చేసి వెంటనే బొగ్గును క్లియర్ చేయాలి. దీనివల్ల సంస్థకు కొంతైనా లాభం వస్తుంది. అలా వదిలేస్తే వృథాగా కాలిపోవడమే గాక తీవ్రంగా వాయు కాలుష్యం ఏర్పడుతున్నది. తద్వారా చుట్టుపక్కల పరిసర ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతున్నది.
-ఎస్.రంగనాథ్, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఇల్లెందు