మునిపల్లి, జనవరి 24: ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం మండలంలోని తక్కడపల్లిలో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో తాగునీటి కష్టాలు ఉండేవన్నారు. టీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామన్నారు. ఇంటింటికీ నీళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
దళితబంధు అద్భుతం..
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు. తక్కడపల్లిలో సోమవారం పర్యటించిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళితబంధు పథకంతో దళితులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఇప్పటికే దళితబంధు అమలు చేస్తున్న ప్రాంతాల్లో దళితులు అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. దళితబంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికోట్టాలన్నారు.
కార్యకర్తలను కడుపులో దాచుకుంటాం..
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను కడుపులో దాచుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. మొగ్దుంపల్లి గ్రామం లో ఎమ్మెల్యే పర్యటించి బాధిత కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ ప్రమాదబీమా రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీశ్, తక్కడపల్లి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్తయ్య, గ్రామస్తులు చంద్రయ్య, ఆనంద్, అశోక్, కుమార్ పాల్గొన్నారు.