హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): దేశంలో 89 క్రిమినల్ కేసులు ఎదురొంటున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని, ఆయన దౌర్జన్యకర పాలనలో రాష్ట్రం అతలాకుతలమైందని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాల దాడే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న పోలీసులు, హోంగార్డులను మాట్లాడలేని భాషలో తిట్టిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డీజీపీ కార్యాలయంలోని లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్‌కు ఆర్ఎస్పీతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
జగ్గారెడ్డి, అర్వింద్‌ల అరెస్టుతోపాటు నల్లబాలు కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తెలంగాణలో అమలు చేయాలని, సీఎంవో వేదికగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని అరికట్టాలని కోరారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్ఎస్ కౌన్సిలర్/కార్పొరేటర్ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, తమవారిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గోల్కొండకు చెందిన రౌడీషీటర్లను వెంటేసుకొచ్చి పోలీసులను దుర్భాషలాడాడని ఆర్ఎస్పీ మండిపడ్డారు. జగ్గారెడ్డి తిట్టిన శివకుమార్ యాదవ్ అనే పోలీస్ అధికారి 2009లో అండర్ వరల్డ్ మాఫియా డాన్లు హైదరాబాద్‌లో తిరుగుతుంటే.. ప్రాణాలకు తెగించి దాడులు చేసి రాష్ట్రాన్ని కాపాడిన అధికారి అని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో మాఫియా డాన్లపై కాల్పులు జరిపిన గొప్ప ఆఫీసర్ శివకుమార్ యాదవ్ అని కొనియాడారు. ప్రెసిడెంట్ గ్యాలెంటరీ అవార్డు తీసుకున్న అటువంటి అధికారిపై జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడటం దారుణమని అన్నారు.
అబ్బాస్, అతని అనుచరుడు మాజిద్ అనే రౌడీలపై గోలొండ పోలీస్‌స్టేషన్‌లో మర్డర్ సహా పలు కేసులు ఉన్నాయని తెలిపారు. జగ్గారెడ్డి వెంట ఉన్న రౌడీలు సంగారెడ్డి ఓటర్లా? వారికి అకడ ఓటు హ కు ఉందా? అని ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల లైన్ దాటి, క్యాండిడేట్ కాని వ్యక్తిని పోలింగ్‌స్టేషన్ నుంచి బయటకు వెళ్లమని పోలీసులు ఐదు సార్లు చెప్పినా వెళ్లలేదని అన్నారు. సీఎం తిట్టినట్టుగానే.. ఆ పార్టీ నేతలూ ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని.. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాపాలన? అని నిలదీశారు. అప్పటికప్పుడు గల్లా పట్టుకొని ఎందుకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.
‘తెలంగాణకు హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. మీ పోలీసులను దారుణంగా దుర్భాషలాడిన వారిపై కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు పడేయలేదు?’ అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. నైని కోల్ బ్లాక్ కుంభకోణంలో ఎన్టీవీ జర్నలిస్టులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారని, అలాంటి చర్యలే జగ్గారెడ్డి విషయంలోఎందుకు తీసుకోరని? ఎందుకు సుమోటో కేసు పెట్టి అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. లికర్ బాటిల్స్‌పై లేబుల్స్ కంట్రాక్టు విషయంలో రిజ్వీ అనే ఐఏఎస్ అధికారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి.. రాజీనామా చేసేలా చేశారని, మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెడితే రాత్రికి రాత్రే పోలీసు అధికారిని ట్రాన్స్ఫర్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం.. పోలీసులను తన్నుకుంటూ తీసుకురమ్మంటే మీరెలా ఊరుకుంటారు? అని ముఖ్యమంత్రిని నిలదీశారు. హోంమంత్రిగా రేవంత్‌రెడ్డి అనర్హుడని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ పోలీసుశాఖ ప్రతిష్టను పెంచారని ఆర్ఎస్పీ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకపోగా.. పోలీసుల ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నారు. నాడు రూ.700 కోట్లతో కేసీఆర్ అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని, ప్రజల భద్రత కోసం పెట్రోలింగ్ కార్లు ఇప్పించారని, ఆడబిడ్డల భద్రత కోసం షీ టీమ్స్ తీసుకొచ్చారని, పోలీస్ రిక్రూట్మెంట్ చేపట్టి పోలీసులకు గొప్ప గౌరవం అందించారని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు వారికి జీతాలిచ్చి, ప్రమోషన్లు పెంచారని తెలిపారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రతీకార వాంఛతో పాలనను గాలికి వదిలేసి, సిట్ మీద సిట్ వేసి వేధిస్తున్నారని మండిపడ్డారు.
సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు అలియాస్ శశిధర్గౌడ్పై కాంగ్రెస్ ప్రభుత్వం మూడు అక్రమ కేసులు పెడితే హైకోర్టు కొట్టేసిందని, కానీ రేవంత్‌రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు చేసి, టాప్‌మోస్ట్ లాయర్లతో సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. ఎలాగైనా నల్లబాలును జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు సైతం వారి చెంప చెళ్లుమనిపించిందని, అక్రమ కేసులు పెట్టొద్దని చెప్తూ.. హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. నల్లబాలు కేసును రెఫర్ చేస్తూ.. పకనున్న కర్ణాటక ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, పార్టీపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పీఆర్వో అన్వేష్‌రెడ్డి, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరాం కర్రి, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ సతీశ్ మన్నె వంటి వారు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ వంటి పేర్లతో ఆఫీసులు నడుపుతూ, బీఆర్ఎస్పై, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులపై అసత్య ప్ర చారాలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కిశోర్‌గౌడ్, బొమ్మెర రామ్మూర్తి, తుంగ బా లు, కడారి స్వామియాదవ్, రఘురాం ఉన్నారు.
సంగారెడ్డి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): పోలీసు అధికారులను దుర్భాషలాడిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సంగారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వానాబేగం భర్త హమీద్‌ను సీఐ శివకుమార్ పోలింగ్ కేం ద్రం వద్ద గల్లా పట్టుకున్నాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో పోలింగ్ కేం ద్రాల వద్దకు వచ్చి ఘర్షణకు దిగారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన జగ్గారెడ్డి సీఐ శివకుమార్, హోం గార్డు యూసుఫ్‌పై దుర్భాషలాడుతూ ఊగిపోయారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని సంగారెడ్డి ఎస్పీని ఆదేశించింది.
ఈ మేరకు 34వ వార్డు ఎన్నికల అధికారి వినయ్‌కుమార్ (ఎఫ్ఎస్టీ) జగ్గారెడ్డిపై సంగారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శివకుమార్ సైతం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను ఎన్నికల విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, తనతోపాటు కుటుంబసభ్యులను దుర్భాషలాడారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ సీఐ రామునాయుడు జగ్గారెడ్డి పై 223, 351, 132, 191(2), 215(1), 216 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.