మెదక్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ ఓట్లు లెక్కింపును వెస్లీ జూనియర్ కళాశాలలో, నర్సాపూర్ బల్దియా ఓట్ల లెక్కింపును బీవిఆర్‌ఐటీ కళాశాలలో, తూప్రాన్ మున్సిపల్ ఓట్ల లెక్కింపును నోబుల్ ఫార్మాకాలేజీ లింగారెడ్డిపల్లిలో, రామాయంపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపును ఎంపీడీవో కార్యాలయంలో చేపడతామని వారు తెలిపారు.
మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించి అధికారులకు, కౌంటింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్వోలు, సూపర్వైజర్లు , అసిస్టెంట్లు , మైక్రో అబ్జర్వర్లు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.