ముంబై : ఒక పక్క కులం, మతం పేరిట ప్రజల్లో చీలికకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో సామాజిక విప్లవాన్ని ఆచరణాత్మకంగా సాధించిన మహారాష్ట్రలోని ‘సౌందలా’ కులరహిత గ్రామంగా మారి దేశంలోని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రగతిశీల భావాలతో ఆదర్శ సామాజిక సంస్కరణల్లో ముందుండే ఈ గ్రామం ‘మా కులం మానవత్వం’ అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మహారాష్ట్రలోనే కాదు.. బహుశా దేశంలోనే మొట్టమొదటి కుల రహిత గ్రామంగా రూపాంతరం చెందింది.
అహల్యనగర్ జిల్లా నేవస తాలుకాలో ఉన్న ఈ గ్రామంలోని ప్రజలందరూ కుల రహిత ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయడంతో ఈ నెల 5న జరిగిన గ్రామ సభ కూడా అధికారికంగా దానికి ఆమోదం తెలిపింది. ‘ప్రగతిశీల భావనకు ఇది చిన్న అడుగు. ఈ పయనం సుదీర్ఘంగా కొనసాగుతుంది’ అని సర్పంచ్ శరద్ అర్గాడే పేర్కొన్నారు.