సిద్దిపేట, జూన్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి):కాం గ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా జిల్లా సమగ్రాభివృద్ధి ప్రణాళిక, కార్యాచరణ ఇప్పటి వరకు సిద్ధం చేయలేదు. జిల్లాలో పాలన కొనసాగుతున్నదా..? లేదా ..? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. మంత్రులు జిల్లాకు రావడానికి ముఖం చాటేస్తున్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి మెద క్ జిల్లా నుంచి దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రులు తమ నియోజకవర్గాలు అందోల్, హుస్నాబాద్ తప్పించి మిగతా నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు. జిల్లా సమస్యలపై స్పందించడం లేదు. కనీసం కలెక్టరేట్లలో రివ్యూలు కూడా నిర్వహించడం లేదు. ఇక ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ముగ్గురు మంత్రులు జిల్లాకు ఉన్నప్పటికీ జిల్లా ప్రగతిపై దృష్టిసారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంతం నియోజకవర్గం అం దోల్పాటు ఇతర ప్రాంతాల్లో ఎప్పుడో ఒకసారి పర్యటిస్తూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేతప్పా జిల్లాలో క్రియాశీలంగా వ్యవహరిస్తడం లేద నే విమర్శలు ఉన్నాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఏనా డు జిల్లా అభివృద్ధి గురించి రివ్యూలు నిర్వహించిన సందర్భాలు లేవు. ఆయన రాష్ట్ర రాజధాని నుం చి నేరుగా హుస్నాబాద్, కరీంనగర్‌కు వెళ్తున్నారు. ప్రభుత్వం ఏర్ప డి ఆరునెలలు గడుస్తున్నా ఇంత వరకు ఏ ఒక్క సమావే శం జిల్లాలో ఏర్పాటు చేయలేదు. ఆయన ఎంతసేపు కరీంనగర్ గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జిల్లా అభివృద్ధి గురించి ఆలోచన చేయడం లేదనే విమర్శలు ఉన్నా యి. హుస్నాబాద్‌లో కూడా అందుబాటులో ఉండడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మా నియోజకవర్గానికి మంత్రి కాని ఆయన ధ్యాసంతా కరీంనగర్‌పైనే ఉందని హుస్నాబాద్ వాసులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ఒకే ఒక్కసారి ప్రజాపాలనపై రివ్యూ నిర్వహించారు. మంత్రులు ఉన్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని మెతుకు సీమ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాడితప్పిన పాలన
సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించడం, ప్రభుత్వ పాలసీలు, పథకాలు, కార్యక్రమాలు అమలు చేయాల్సిన మంత్రులు ముఖం చాటేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలన గాడి తప్పింది. అకాల వర్షాల కారణంగా యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో తడిసి ముద్దయినా కనీసం రైతులను ఈ ప్రభుత్వం ఓదార్చలేదు. తడిసిన ధాన్యం కొనడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. జిల్లాలో ధాన్యం డబ్బులు రూ.60 కోట్లకు బకాయిలుగా ఉన్నాయి. ఈ డబ్బులు రైతులకు త్వరగా ఇప్పించడానికి మంత్రులు చొరవ చూపడం లేదు. రైస్‌మిల్లర్లు, అధికార యంత్రాంగం కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడి చేసినా చర్యలు తీసుకోలేదు. పాఠశాలలు పునః ప్రారంభమైనా కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చాలాచోట్ల బుక్స్, యూనిఫామ్ ఇప్పటికీ విద్యార్థులకు అందలేదు. రైతుభరోసాపై ఊసే లేదు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని అరికట్టడానికి మంత్రులు యం త్రాంగానికి ఎలాంటి దిశానిర్దేశం చేయడం లేదు. ఏటా వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు. రైతులతో సమావేశాలు నిర్వహించి చర్చించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వర్షాకాలం ప్రారంభమైనందును సీజనల్ వ్యాధులపై అప్రమత్తత తదితర అంశాలపై రివ్యూలు నిర్వహించడం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు చేతి నుంచి డబ్బులు ఖర్చుచేస్తూ పాలన సాగిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. విద్యు త్ సిబ్బంది ఎక్కడి కక్కడ చెట్లను నరికి వేస్తున్నారు. నర్సరీలు ఎండిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రధానంగా తాగు, సాగునీరు, కరెంట్ సమస్యలపై కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత మం త్రులపై ఉంది. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. మత్తు పదార్థాలతో యు వత చిత్తవుతున్నారు. ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. వీటన్నింటిని నియంత్రించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. వాటి అమలు అంతంలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలు చేస్తూ, సమీక్షలు నిర్వహిస్తూ, కఠినం గా వ్యవహరిస్తే పాలన గాడిన పడే అవకాశం ఉంది.