దుబ్బాక, జూన్20 : దుబ్బాకకు తొలిసారిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)కి నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం పూర్తిగా రసాభాసగా మారింది. కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు గందరగోళ పరిస్థితితో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు , తొలిసారిగా వచ్చిన మంత్రికి ఆసంతృప్తిని మిగిల్చింది.
ఓ పక్క బీఆర్ఎస్ నాయకుల నుండి నిరసనలు.. మరోపక్క తమ సొంత పార్టీ కాంగ్రెస్ నాయకుల వైఖరితో రాష్ట్ర కార్మిక, గనుల శాఖా మంత్రి వివేక్ నిరాశ, ఆసంతృప్తికి లోనయ్యారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు జిల్లా పాలనాధికారి హైమవతి సైతం ప్రయత్నాలు చేసినప్పటీకీ ఫలించలేదు. కార్యక్రమం నిర్వాహణలో పోలీసుల, అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
దుబ్బాకలోని రజినీకాంత్‌రెడ్డి ఫంక్షన్లో హాల్లో శుక్రవారం మధ్యాహ్నం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫొటోను చిన్నగా పెట్టారు. దాంతో, బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్, జిల్లా అదనపు కలెక్టర్లను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అగౌరవపరచేందుకు పనికట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారా? అంటూ అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు సభా ప్రాంగణంలో నేల పై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు.
ఆనంతరం కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వేదికపైకి వచ్చి కూర్చోవడంతో బీఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే సూచించారు.
అనతరం ప్రభాకర్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల నినాదాలతో సభా ప్రాగంణం దద్దరిల్లింది నియోజకవర్గంలో చాల దూరం నుండి గ్రామీణ లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి గంటల తరబడి వేచి ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. జిల్లా కలెక్టర్ హైమవతి కూడా కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించాలని సూచించారు. ఈ విషయంలో మంత్రి వివేక్ తమసొంత పార్టీ కాంగ్రెస్ నాయకుల తీరుపై ఒకింత ఆసంతృప్తికి లోనయ్యారు.
నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చోరువతో దుబ్బాక నియోజకవర్గంలో 6 వేల మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, అందజేసినట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల హామిలు నేటికి అమలుకు నోచుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 6లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు ప్రయోజనం చేకూరిందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాకలో 2600 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. విడతల వారిగా అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. 1970లో పేదల కోసం అప్పటీ ప్రధాని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు వివేక్. రేవంత్‌రెడ్డి సర్కారులో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనాస్ ఇచ్చిందని మంత్రి చెప్పారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగించిందని బీఆర్ఎస్ నాయకులు చేతులు ఎత్తి గట్టిగా నినాదాలు చేశారు.