సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం 9వ వార్డులో రూ.4 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. వైద్యారోగ్య రంగంపై బడ్జెట్లో అధిక నిధులు వెచ్చిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్య ఉపకరణాలు, మందుల కోసం సరిపడా నిధులను సమకూర్చుతోందని మంత్రి వివరించారు.
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా, అంతకంటే మిన్నగా ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైద్య సేవల కోసం ప్రజలు, ముఖ్యంగా పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళాలని మంత్రి సూచించారు. దీని వల్ల పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందడంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలోనే డెలివరీలు జరిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. అవసరమైతే తప్ప సిజేరియన్ చేయవద్దని ఆసుపత్రి వైద్యులకు ఇప్పటికే స్పష్టం చేశామని మంత్రి తెలిపారు.
సిజేరియన్ల కారణంగా ఎక్కువ శాతం మంది పిల్లలు అమృతం లాంటి ముర్రుపాలకు దూరమవుతున్నారు. అపోహలు, అనుమానాలు, ఇతర కారణాలతో బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు అందడం లేదన్నారు. సాధారణంగా పుట్టిన బిడ్డ మొదటి గంటలో చాలా తక్కువ మొత్తంలో తల్లికి పాలు వస్తాయి. వాటినే ముర్రుపాలుగా పిలుస్తుంటారు. వీటిలో బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్లు ఉంటాయి. వీటిని బిడ్డకు పట్టడం వల్ల.. ఆ వయసులో ప్రమాదకర రోగాలను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. పైగా.. అప్పుడే పుట్టిన బిడ్డకు సులువుగా జీర్ణం అవుతాయన్నారు. అందుకే.. ఈ పాలను అమృతంగా చెబుతుంటారు వైద్యులు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పాలను.. తెలంగాణలో కేవలం 34% మంది మాత్రమే మొదటి గంటలో ముర్రుపాలు తాగుతున్నారని అన్నారు.

సిజేరియన్లు చేసినప్పుడు తల్లికి మత్తు ఇస్తారు కాబట్టి పాలు పట్టకూడదన్న అపోహ కొందరిలో ఉంది. అలాగే, కొందరు ఈ పాలు మంచివి కావన్న భావనతో పారబోస్తున్నారనీ అన్నారు. ఇలా అనేక కారణాలతో పిల్లలను ముర్రుపాలకు దూరం చేసి వారికి సహజంగా లభించే రోగనిరోధక శక్తి అందకుండా చేస్తున్నారనీ తెలిపారు.
త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని హరీష్ రావు తెలిపారు. వచ్చే నెలలో అభయ హస్తం లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం మిత్తితో సహా చెల్లించనుందని మంత్రి తెలిపారు. అలాగే సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు మూడు కిస్తీల కింద మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం చేయనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.