భావప్రకటన స్వేచ్ఛే అన్ని స్వేచ్ఛలకు పునాది. మనసులో భావాలు చెప్పుకొనే స్వేచ్ఛ.. ఒక హక్కు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా అందులో భాగమే. ఆ హక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. ప్రజాక్షేమం పట్టని పాలకులు, సమాధానాలు చెప్పుకోలేని విఫల నాయకులు, తమ విధానాలపై విశ్వాసంలేని నియంతలు తమను ప్రశ్నిస్తే సహించరు అనేది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజాస్వామిక హక్కుల కోసం గొంతెత్తిన ప్రజల, ప్రజల కోసం గొంతెత్తిన ప్రజాస్వామికవాదుల ప్రాణాలు తీసిన పాలకులు చరిత్రలో కనిపిస్తారు. ఆ నెత్తుటి మరకలు చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఇటీవలి చరిత్ర చూసినా అలాంటి ఆనవాళ్లు మన ముందు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపైనా ఇలాంటి చర్చనే నడుస్తున్నది. సోషల్ మీడియాను నియంత్రించేందుకు కొత్త చట్టం తీసుకొస్తానని సీఎం ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మసిపూసి మారేడు కాయ చేసినట్టుగా ఆయన చెప్పిన మాటలు ఫేక్ న్యూస్ నియంత్రణ అనే రంగును పులిమినట్టు కనిపిస్తున్నది. కానీ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ తరహా అరెస్టులు, నిలదిస్తే నిర్బంధాలు చూస్తున్నాం. ఇలాంటి అనుభవాల పరంపరలో ఏర్పడిన ఆలోచన దృక్పథంలో చూస్తే రేవంత్‌రెడ్డి మాటల్లో మర్మం అర్థం చేసుకోవచ్చు. సంప్రదాయ మీడియాకు దీటుగా ప్రభావవంతమైన వేదికగా నిలుస్తున్న సామాజిక మాధ్యమాలపైనా పాలకుల కన్నుపడింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఏమైనా తప్పులు జరిగితే శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి. ఫేక్‌న్యూస్, దూషణలు, సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత, సుప్రీంకోర్టు తీర్పులు, విధివిధానాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. మరి కొత్తగా సీఎం తెస్తానన్న చట్టంలో ఏమి ఉండబోతున్నది? అనేది ప్రశ్న. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలు నిలదీస్తుంటే కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాధానాలు లేవు కాబట్టి… అసలు ప్రశ్నలే లేకుండా చేయాలని రేవంత్‌రెడ్డి జిమ్మిక్కులు చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గల్లంతయ్యాయి. గత ప్రభుత్వం అమలు చేసిన మానవీయ పథకాల జాడ ఇప్పుడు లేదు. మోసపోయి గోస పడుతున్నామని ప్రజలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ఘనత వహించిన తమ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పుకొన్నారు. చెత్త తీసుకపోయేటోళ్లు మాట వింటలేరని, పని చేస్తలేరని సెలవిచ్చారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా సీఎం మాటలు ఉన్నాయి. కనీసం పారిశుధ్య నిర్వహణ కూడా తమకు చేతగావడంలేదని సీఎం మాట్లాడితే ఇక ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన గురించి ఏమి అనుకోవాలో ఆయనే చెప్పాలి! రాష్ట్రం పదేండ్ల తర్వాత ఏయే రంగాల్లో ఎలా ఉండాలో ఆలోచించి దార్శనిక ప్రణాళికలు రచించడం, ఆ దిశగా కార్యాచరణ రూపొందించడం, అమలు చేయడం, ఫలితాలు సాధించడం అనే బృహత్తర కార్యాన్ని కాంగ్రెస్ పాలకుల నుంచి ఆశించడం అత్యాశనే అవుతుంది. ఇన్ని అవలక్షణాలు, అడ్డగోలు విధానాలు, పేదల పొట్టగొట్టే అమానవీయ వైఖరులు, ఇండ్లు కూల్చే దుర్మార్గాలు గల పాలకులను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నది.
సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారం ఎవరికి మేలు చేసిందంటే అది ముమ్మాటికీ కాంగ్రెస్‌కే. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అనుకూల, చెల్లింపు మీడియా విష ప్రచారం చేసింది. కానీ నాటి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోలేదు. మానవీయ దృక్పథంతో, బృహత్తర ఆశయాలతో పని చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం తన ఎమర్జెన్సీ వాసనల నుంచి పూర్తిగా బయటపడనట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్‌మీడియా వారియర్లపై కేసులు నమోదు చేసింది. ఒకటే అంశంపై పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసి వేధింపులకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరి హద్దులు దాటడంతో హైకోర్టు మొట్టికాయలు వేసింది. నల్లబాలు కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా నిరుడు ఫిబ్రవరిలో అత్యున్నత న్యాయస్థానంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నల్లబాలుపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను ధర్మాసనం రద్దు చేసింది. విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ అని, మూడో వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులేవీ పెట్టొద్దని, మేజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలని తేల్చిచెప్పింది. ‘తలుగు తెంచుకున్న దొంగబర్రెకు ముక్కు తాడు వేసినట్టు’గా కాంగ్రెస్ తీరుపై సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చినా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ఆర్టికల్ 19(1)(ఏ)కు లోబడి ఉండాల్సిందే. ఇక పాలకులు ఓ విషయం గుర్తుంచుకోవాలి. నచ్చని భావాలు వ్యక్తం చేసే ఇతరుల భావప్రకటన స్వేచ్ఛను గౌరవించకపోతే.. తాము అనుభవిస్తున్న స్వేచ్ఛ పట్ల కూడా వారికి నమ్మకంలేదని అనుకోవాల్సి ఉంటుంది.