సిద్దిపేట, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలలు పలు సమస్యలతో పునఃప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. కేసీఆర్ ప్రభు త్వ హయాంలో ఉన్న అల్పాహార పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. దీంతో విద్యార్థులు ఆకలితోనే విద్యను అభ్యసించారు. పాఠశాల ప్రారంభం రోజే అన్ని పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తామని చెప్పినా అది ఆచరణలో సాధ్యం కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు తెరిచే నాటికి అన్ని సిద్ధం చేసి అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించ లేదు. మరోవైపు ఉపాధ్యాయులంతా బదిలీలపై దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాలో 638 ప్రాథమిక, 113 ప్రాధమికోన్నత, 227 ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థులు 85, 291 మంది విధ్యనభ్యసిస్తున్నారు. 4,135 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 623 ప్రాథమిక, 128 ప్రాథమికోన్నత, 146 ఉన్నత పాఠశాలలు ఉండగా మొత్తం 68,449 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 3,387 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 861,ప్రాథమికోన్నత 191, ఉన్నత పాఠశాలలు 203 కాగా మొత్తం 1,16,707 మంది విద్యార్థులు, 5,025 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏక రూప దుస్తుల్లో భాగంగా 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు ఫ్రాక్, 4,5వ తరగతి విద్యార్థినీలకు స్కర్ట్ ఇస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినీలకు పంజాబీ డ్రెస్, బాలురకు నెక్కరు లేదా ప్యాంట్, షర్టు రెండు జేబులు, మధ్యలో క్లాత్‌తో పట్టి, భుజాలపై క్లాపులు, రెండు చేతులకు క్లిప్పులతో కూడిన డ్రెస్‌లను అందించాలి. కానీ ఉమ్మడి మెదక్ జిల్లా అవసరం మేరకు వస్త్రం రాకపోవడం, కుట్టడం పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు ఇంకా 40శాతానికిపైగా కొత్త యూనిఫామ్స్ అందించాల్సి ఉన్నది.
యూనిఫామ్స్‌కు మరో 20 రోజులు
ప్రతి విద్యార్థికీ రెండు జతల యూనిఫామ్స్‌కు ప్రస్తుతం ఒక జత ఇచ్చారు. ఇంకో జత మరో 20 రోజులు పట్టే అవకాశం ఉన్నది. దీంతో పాఠశాలల ప్రారంభం రోజు విద్యార్థులు పాత యూనిఫామ్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుస్తకాలతోపాటు నోట్ పుస్తకాలను అందించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా పుస్తకాలను, నోట్ పుస్తకాలను పాఠశాలల ప్రారంభం రోజు అందించాలని సంకల్పించింది. కానీ ఆచరణలో సాధ్యం కాలేదు. తొలి రోజు ఆయా క్లాస్‌కు సంబంధించి కొన్ని టెక్ట్స్ బుక్స్ అరకొరగానే అందించారు. ఇక నోట్ పుస్తకాలు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అందిస్తారు.
6,7 తరగతి వాళ్లకు 6 చొప్పున, 8వ తరగతికి 7 నోట్ పుస్తకాలు, 9,10 తరగతి విద్యార్థులకు 14, ఇంటర్ విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. కానీ పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఉన్నవాటిలో కొన్నింటిని మాత్రమే ఇచ్చారు. మిగితావి మరో పక్షం రోజుల్లో అందించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అల్పాహారం పథకాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం నిలిపివేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేసి, పేద విద్యార్థుల ఆకలిని తీర్చింది. కాం గ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని నిలిపివేయడంతో విద్యార్థులు అల్పాహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. విద్యార్థులను దృష్టి లో పెట్టుకొని వెంటనే అల్పాహారం పథకాన్ని కొనసాగించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.