చేర్యాల, మార్చి 3 : సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో రోజురోజుకు వస్తున్న మార్పులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా చేర్యాల ప్రాంతంలో ఉదయం పొగమంచు కురుస్తుండడం, మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి.
ఆదివారం వేకువజామున శీతకాలంలో మంచు కురిసిన విధంగా చేర్యాల పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. తిరిగి 9 గంటల అనంతరం భానుడు కన్పించి తన ప్రతాపాన్ని చూపించాడు. గత వారం రోజులుగా ఉదయం ఒక విధంగా, మధ్యాహ్నం మరో మాదిరిగా వాతావరణం ఉంటున్నది.