చేర్యాల, జూన్ 6 : చేర్యాల ప్రాంతంలోని వివిధ వాగుల నుంచి రాత్రికి రాత్రే ఇసుకను మాయం చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే కొందరు వ్యక్తులు అర్ధరాత్రి దాటిన అనంతరం ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను సమీపంలో ఉన్న పట్టణాలు, మండల కేంద్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఇసుక రవాణాదారులు ఇసుకను ఒకచోట డంపు చేసి రేటు రాగానే రాత్రికిరాత్రి గుట్టుచప్పుడు కాకుండా బేరం కుదుర్చుకున్న ప్రదేశానికి ఇసుకను చేర్చి కాసులు సంపాదించుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా చేరర్యాల మండలంలోని ఆకునూరు శివారులో ఉన్న రుద్రాయపల్లి వాగు నుంచి గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇసుకును అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని రోజుల వరకు కిమ్మనకుండా ఇసుక రవాణాదారులు వరికోతలు ముగియగానే పొలాల మార్గం నుంచి నేరుగా రుద్రాయపల్లి వాగుకు చేరుకుని పదుల సంఖ్యలో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇసుక రవాణా తంతు కొనసాగుతుండటంతో సమీపంలో ఉన్న రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను మాయం చేస్తే రానున్న రోజుల్లో తమ బోరు బావుల నుంచి నీటి చుక్క రాదని సంబంధిత శాఖ అధికారులు ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.