జగదేవపూర్ జూన్ 8 : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జగదేవపూర్ మండలం నిర్మల్‌నగర్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కర్రె కిరణ్ (27) ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి జగదేవపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి కాపురానికి రావడం లేదు. దాంతో మనస్తాపానికి గురైన కిరణ్ నివాసంలోనే మంచం నవారును స్లాబ్‌కు బిగించి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబీకులు వెంటనే సర్కారు దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ చంద్రమోహన్ తెలిపారు. కుటుంబీకుల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎస్ఐ చంద్రమోమన్ సూచించారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదన్నారు. చిన్న చిన్న సమస్యలకే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాబిన్నం చేస్తాయన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే.. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు.