తొగుట : విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిద్దిపేట మండలం వెంకట్రావుపేట ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం వెంకటేశం అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉన్నత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు జ్ఞాన దేవాలయాలుగా నిలుస్తున్నాయని, అలాంటి సర్కారు బడులను కాపాడుకోవడం ప్రతి గ్రామస్తుడి సామాజిక బాధ్యత అని కోరారు.
ప్రతి చిన్నారి బడిబాట పట్టి విద్యను అభ్యసిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, చదువుతోనే జీవితాల్లో వెలుగు నిండుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, గ్రామ పెద్దలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అండగా నిలవాలన్నారు. సర్కారు బడి మనకు గర్వకారణమని ప్రతి విద్యార్థి ని ప్రయివేట్ కు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు.