సిద్దిపేట జిల్లా : సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలిపోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్పై వేధింపులు సీరియల్ తరహాలో కొనసాగుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించి ప్రతిపక్ష నాయకులను వేధి స్తున్నాడని విమర్శించారు.
అలీబాబా 40 దొంగలు, దండుపాల్యం ముఠా తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బొగ్గు స్కామ్, 9 వేల ఎకరాల భూ స్కామ్, ఇలా అనేక స్కామ్‌లు చేశారని చెప్పారు. ఆ స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు.
1875 లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చిందని, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం పోలీస్‌శాఖ సమాచారం సేకరిస్తుందని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరని, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికమని అన్నారు. 14 ఏండ్లు మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ తేవడమే కేసీఆర్ చేసిన నేరమా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కక్ష్యతోనే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణకు రమ్మని.. కొండా సురేఖ, సీతక్కలు సమ్మక్క సారలమ్మ జాతరకు రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానించారని, కానీ పోలీస్ అధికారులు మాత్రం నందినగర్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారని, ఇది దుర్మార్గమైన చర్య అని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్ ఆపిడవిట్లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌కి నోటీస్ ఇచ్చారని అన్నారు. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంటి అడ్రస్ కొడంగల్ అయితే గతంలో అధికారులు హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారని, కేసీఆర్ విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయమని హెచ్చరించారు.