జై తెలంగాణ ఇది నినాదం కాదు. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస. అంతేకాదు అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం కూడా.. అన్నింటికీ మించి బలమైన ఆకాంక్ష. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలోనే సాయుధ రైతాంగ తిరుగుబాటు మొదలైంది. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం షురూ అయ్యింది. 2009 తర్వాత మలిదశ ఉద్యమం తారస్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్రం కోసం జిల్లాకు చెందిన పలువురు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఎందరో ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు అందజేయడంతో పాటు ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.
– సిద్దిపేట జిల్లా నెట్వర్క్, జూన్ 21
కొండపాక (కుకునూరుపల్లి), జూన్ 21 : కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ఉనుగూరు పద్మ-చంద్రం దంపతుల పెద్ద కొడుకు శ్రీకాంత్ నోట ఎప్పుడూ చూసినా తెలంగాణ మాటే. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తే మన బతుకులు మారుతాయంటూ అమ్మతో చెప్పెటోడు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కేసీఆర్‌ను బలవంతగా అరెస్టు చేయడంతో శ్రీకాంత్ తీవ్రంగా మదనపడ్డాడు. తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్రులు వక్రీకరించడం, కేంద్ర ప్రభుత్వంపై కోపానికి గురైన శ్రీకాంత్ 2009 నవంబర్ 30న వ్యవసాయబావి దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అండగా నిలిచిన ప్రభుత్వం..
తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టిన శ్రీకాంత్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. తెలంగాణ ఏర్పా టు సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు శ్రీకాంత్ కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమరుడు శ్రీకాంత్ తమ్ముడు శ్రీధర్‌కు 2018 జూన్ 8న ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇచ్చారు. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్‌లో పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నాడు.
ఉద్యమకారుడి కుటుంబానికి ప్రభుత్వం బాసట
నంగునూరు, జూన్ 21 : తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. అమరుడి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సాయం అందించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అండగా నిలబడింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండంరాజుపల్లి గ్రామానికి చెందిన బండి పరశురాములు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. ఉద్యమానికి ఆకర్షితుడై తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతోపాటు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ అండగా నిలిచాడు. అమరుడు బండి పరశురాములు సోదరుడు బండి బాల్‌రాజుకు ఉద్యోగం ఇచ్చాడు. నంగునూరు పశువైద్య కార్యాలయంలో సబ్ ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2016 జూన్ 10న ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.
మా కష్టాలు తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్
కుటుంబాన్ని పోషించుకో లేక అప్పు లు చేశాను. అప్పులు తీర్చేందుకు దుబాయ్‌కి పోయాను. దుబాయ్‌లో ఉన్నప్పుడే నా పెద్ద కొడుకు శ్రీకాంత్ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మా కుటుంబాన్ని సీఎం కేసీఆర్ దేవుడిలా ఆదుకున్నాడు. నా చిన్న కొడుకుకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు రూ.10లక్షలు ఆర్థిక సాయం చేశాడు.
-ఉనుగూరు చంద్రం,
అమరుడు శ్రీకాంత్ తండ్రి కొడుకును తలుచుకోని రోజు లేదు
నా పెద్ద కొడుకు శ్రీధర్ నాకు ఎన్నో పను ల్లో సాయం అయ్యేవాడు. ఎప్పుడూ తెలంగాణ ముచ్చట్లు చెప్పేవాడు. ఉద్యమం మనకు వద్దు బిడ్డ బాగా చదువుకొండి ఏదైనా పని చేసుకొని బతుకండి అని చెప్పేదాన్ని. అమ్మ తెలంగాణ ఈ రోజు కోసం కాదు.. రేపటి భవిష్యత్ తరాల కోసం అని చెప్పిన నా కొడుకు మాటలు ఇప్పటికీ యాదికొస్తున్నాయి. తెలంగాణ వచ్చినంకా నా కొడుకు కన్న కల నెరవేరిందని సం తోష పడ్డా. శ్రీకాంత్‌ను యాది చేసుకొని రోజులేదు. తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంత్ ప్రాణలర్పించడంతో మా కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డాడు. రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేయడంతో పాటు నా చిన్న కొడుకుకు సర్కారు నౌకరీ ఇచ్చిండు.
-ఉనుగూరు పద్మ, అమరుడు శ్రీకాంత్ తల్లి
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ప్రత్యేక తెలంగాణ కోసం సోదరుడు పరశురాములు ఆత్మబలిదానం చేసుకున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకుంటూ వస్తున్నది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో మా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. రూ.10లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడు ఎలాంటి బాధలు లేకుండా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– బండి బాల్‌రాజు, అమరుడు బండి పరశురాముడు సోదరుడు