సిద్దిపేట, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఊరూవాడ గులాబీ పండుగను జరుపుకొన్నారు. వాడవాడలా గులాబీ జెండాను ఎగుర వేసి స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన దీక్షలు, రైల్‌రోకోలు, రోడ్ల దిగ్బంధాలు, మానవహారాలు, వంటావార్పులు, రాస్తారోకోలు, తదితర పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అమరులను స్మరించుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నాటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇప్పటి పరిస్థితులు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడి, జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీ సమావేశాలకు ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, వంటేరి యాదవరెడ్డితో పాటు జడ్పీ చైర్పర్సన్లు వేలేటి రోజాశర్మ (సిద్దిపేట), హేమలత (మెదక్), మంజుశ్రీ (సంగారెడ్డి), కార్పొరేషన్ల చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ముఖ్యనేతలు ప్లీనరీ సమావేశానికి తరలివెళ్లారు. స్థానిక నాయకులు గ్రామాల్లో జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొని టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా పార్టీ ఎలా ఎదిగిందో శ్రేణులకు వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్కు కంచుకోటగా మారిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీదే విజయం అన్న తరహాలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని వారు చెప్పారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో పార్టీ పటిష్టత, జిల్లా అభివృద్ధిలో అన్నింటా అగ్రగామిగా ఉందని జెండా పండుగ కార్యక్రమంలో నేతలు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీలో జరిగిన ప్లీనరీ సమావేశానికి ఆహ్వానం అందిన వారు వెళ్లగా, అందని వారంతా ప్లీనరీ సమావేశాన్ని టీవీల్లో వీక్షించారు.