మద్దూరు(ధూళిమిట్ట), జూలై18: ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా పీహెచ్సీని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావల్సిన వనరులను ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. పీహెచ్సీ మరమ్మతుల పనులను సకాలంలో పూర్తి చేయించాలని పీఆర్ ఏఈని ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాధిక, తహసీల్దార్ ఏజీ రహీం, ఎంపీడీవో రామ్మోహన్, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చిన్ను సహాని తదితరులు ఉన్నారు.