హుస్నాబాద్, మే 10: ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కటీ అమలు చేయకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, వారిని అడుగడుగునా ప్రజలు నిలదీయాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి బాండు పేపర్లు రాసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌లతో కలిసి మాట్లాడారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి సన్నిధిలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీ తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ వాటి ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ చెప్పిన కల్యాణలక్ష్మి డబ్బు లు, తులం బంగారం, మహిళలకు రూ.2,500 డబ్బులు, రూ.4వేల పింఛన్ ఏదని ప్రశ్నించా రు. వీటన్నింటిపై ఓటు అడిగేందుకు వచ్చిన మంత్రిని, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలను కోరారు. రైతులు పండించిన ధాన్యానికి బోనస్ అనేది బోగస్‌గా మారిందన్నారు. కాంగ్రెస్ మోసాన్ని గమనించిన ప్రజలకు ఆ పార్టీ మీటింగులకు కూడా వెళ్లడం లేదని, ఇటీవల జరిగిన రాహుల్‌గాంధీ రోడ్‌షోలు జనంలేక వెలవెల బోయాయని తెలిపారు. బీజేపీ కార్పొరేట్లకు కొమ్ముకాసి కర్షకులకు వెన్నుపోటు పొడిచిందన్నారు.
గడిచిన ఐదేండ్లలో కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ పైసా కూడా తేలేదన్నారు. దేవుడి ఫొటోలు ఇచ్చి ఓట్లు అడుగుతున్న బండి సంజయ్ అభివృద్ధి చేయలేడన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వికాసం కోసం బోయినపల్లి వినోదన్నను గెలిపించుకోవాలన్నారు. వినోదన్న గెలుపుతోనే హుస్నాబాద్ అభివృద్ధి జరుగుతుందని, 13వ తేదీన జరుగనున్న పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటు వేసి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ…ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. దీంతో నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా రైల్వేలైన్ మంజూరు చేయించగా పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ ఆలయం అభివృద్ధి గురించి గానీ, కరీంనగర్ అభివృద్ధి గురించి గానీ మాట్లాడకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు రవీందర్రావు, మధుసూదన్‌రెడ్డి, ఎండీ అన్వర్, గోవిందు రవి, వెంకట్, తిరుపతిరెడ్డి, పుష్ప, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.