రాయపోల్: సిద్దిపేట జిల్లా (Siddipet) రాయపోల్ మండల పరిధిలోని గుర్రాల సోఫా వద్ద రైతులు రోడ్డుపైన ధర్నా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు తమ పంట పొలాలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రామారం, ఇందు ప్రియాల్ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే పంట నష్టపరిహారం అందించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు మూడు గంటలపాతో గంటల పాటు ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. అయినప్పటికీ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆరుగాలం కష్టపడి పండిన పంట వడగండ్ల వానకు నేల రాలడంతో తమకు పెట్టుబడులు కూడా రాలేని దుస్థితి ఏర్పడిందని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీంతో సంబంధిత అధికారులను అక్కడికి రప్పించి రైతులతో మాట్లాడించారు.
మండల వ్యవసాయ అధికారి నరేష్, ఆర్ఐ భాను ప్రకాశ్, దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్దీప్ కలిసి రైతులతో మాట్లాడుతూ.. పంట నష్టపోయిన వివరాలను అధికారులు సేకరించి, నివేదికనుపై అధికారులకు పంపిస్తామని, పరిహారం అందేవిధంగా తమ వంతు కృషి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.