Mud Road | రాయపోల్, ఆగస్టు 12 : చిన్నపాటి వర్షానికి రోడ్డంతా చిత్తడి కావడంతో రైతు వేదిక కార్యాలయానికి వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడం వలన రైతులు నిత్యం బురదలో నడుచుకుంటూ వెళుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రైతు వేదిక కార్యాలయం నిర్మించారు. అయితే దానికి అనుగుణంగా రోడ్డు మార్గం లేకపోవడంతో వర్షాలు కురిస్తే కార్యాలయానికి వెళ్లాలంటే రైతులు, అధికారులు భయపడుతున్నారు.
కాలుజారి ఎప్పుడు కింద పడతామో తెలియని పరిస్థితి నెలకొందని పలు గ్రామాల రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఇరుకైన రోడ్డు ఆపై వర్షాలకు రోడ్డంతా బురదమయం కావడంతో కార్యాలయానికి వచ్చే రైతులు వాపోతున్నారు. ఇదేమి రోడ్డు అంటూ మరమ్మతు చేసేవారు కరువైపోయారా..? అంటూ పలు గ్రామా రైతులు పేర్కొంటున్నారు. రాయపోల్ రైతు వేదిక కార్యాలయానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు వస్తూ పోతుంటారు. సరైన రోడ్డు మార్గం లేక నానా అవస్థలు పడుతూ కార్యాలయానికి వెళ్తున్నారు.
కార్యాలయానికి వచ్చే అధికారులు సైతం ఇబ్బందులు పడుతూ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రైతు వేదిక కార్యాలయం వరకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలు గ్రామాలు రైతులు పేర్కొంటున్నారు.
Dharmasthala: ధర్మస్థలిలో మృతదేహాల వెలికితీత.. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు
RS Praveen Kumar | కోడి గుడ్ల కుంభకోణం రూ. 600 కోట్లు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Gunfire | చందానగర్‌లో దొంగల బీభత్సం.. ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు