Urea | రాయపోల్, ఆగస్టు 11 : యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అంతకుముందు బోరుబావుల వద్ద వేసిన వరి నాట్లకు యూరియా అవసరం ఉండడంతో రైతులు ఇటు పొలం పనులతోపాటు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రోహిణి కార్తెతో మొదలైన వ్యవసాయ పనులు సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో బోరుబావుల వద్ద కొద్దిపాటి నాట్లు వేశారు. ముందు వేసిన నాట్లకు పై పాటుగా యూరియా వేయాల్సి ఉన్నా అది దొరకకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో నాలుగు ఆగ్రోస్ కేంద్రాలు, సుమారు 40 ఫర్టిలైజర్ షాపులు ఉన్నప్పటికీ యూరియా కొరత తీరడం లేదు. ఒక్క ఆధార్ కార్డుకు రెండు బ్యాగుల యూరియాను ఇవ్వడంతోపాటు దానికితోడు నానో యూరియా, పొటాష్ ఎరువును అందిస్తున్నారు. అవసరం లేకున్నా రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా వచ్చినప్పుడల్లా ఆధార్ కార్డుకు ఒకటి ఇస్తాం.. రెండు ఇస్తామని దుకాణం యజమానులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం దౌల్తాబాద్ మండలం హైమద్ నగర్ గ్రామానికి రెండు ఫర్టిలైజర్ షాపులకు యూరియా రాగా.. ఫర్టిలైజర్ వ్యాపారులు ఒక్క ఆధార్ కార్డుకు రెండు బ్యాగుల యూరియాను అందించారు. దీంతో రైతులు తీరు అసంతృప్తికి గురయ్యారు. వర్షాలు కురుస్తున్నందున వరి, మొక్కజొన్న పంటకు యూరియా వేయాల్సి ఉందని.. కానీ రెండు సంచులు ఇస్తుండటంతో తమకు సరిపోవడం లేదని రైతులు వాపోయారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని ఆయా గ్రామాల రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు యూరియాను అధికారులు అందుబాటులో ఉంచే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రెండు మండలాల రైతులు పేర్కొంటున్నారు.
urea | గన్నేరువరంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
Farmers concern | యూరియా కొరతపై రైతుల ఆందోళన.. పోలీసుల పహారాలో పంపిణీ
Karepalli | కారేపల్లి మండలంలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ