కారేపల్లి ఆగస్టు 11 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగిందని మండల వైద్యాధికారి సురేష్ తెలిపారు. మండలంలో గల అన్ని గ్రామాల్లో 2 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ నిమిత్తము ఒక ఆల్బెండజోల్ మాత్ర మధ్యాహ్నం భోజనం తర్వాత ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం వలన పిల్లలలో ఉన్న నులిపురుగులు నశించి పిల్లలకు రక్తహీనత రాకుండా కాపాడుతుందని తెలిపారు. స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా విద్యార్థులతో నులిపురుగుల నివారణ మాత్రలను స్థానిక వైద్య సిబ్బంది మింగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సీహెచ్ఒలు, ఎఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు, ఎంఎల్ హెచ్ పి లు, ఆశా కార్యకర్తలు, ప్రతి స్కూలు ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో నిర్వహించినట్లు తెలిపారు.