రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. ప్రభుత్వ బడులను బతికించుకోవడం అందరి బాధ్యత. సర్కారు బడిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టనుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్నివర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. విద్యావేత్తలు, మేధావులు, పేద, బడుగు బలహీనవర్గాల పిల్లల తల్లిదండ్రులు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, జనవరి 24 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా ఆంగ్లంతోనే ముడిపడిఉన్నది. తెలుగు మీడియంలో చదివిన వారు ఆంగ్ల మాధ్యమం విద్యార్థులతో పోటీపడలేక పోతున్నారు. జిల్లాలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు కొన్నేండ్లుగా ఆంగ్ల మాధ్యమ చదువులపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూర్చి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గనున్నది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సహకారం, వారి అభీష్టం మేరకు ఉపాధ్యాయులు ముందుకు వచ్చి ఆంగ్ల మాధ్యమం విద్యను బోధిస్తున్నారు. ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఉదాహరణకు సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్న పాఠశాలను చెప్పుకోవచ్చు. ఈ పాఠశాలలో ఏటా అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉంది. ఈ పాఠశాలలో ఏటా నో అడ్మిషన్ బోర్డు కనిపిస్తుంది. ఇలా ప్రతి పాఠశాలను తయారు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం.
మండలంయూనిట్గా ఎంపిక…
తొలుత మండలం యూనిట్‌గా అత్యధికంగా ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక వసతులు కల్పిస్తారు. జిల్లా మంత్రి, కలెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటి ద్వారా తాజాగా పెరిగిన ఎన్రోల్మెంట్ ఆధారంగా పాఠశాలలను ఎంపిక చేస్తారు. రెండో విడతలో 35శాతం, మూడో విడతలో 30శాతం పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్లను కేటాయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది. ఇటీవలే జరిగిన బదిలీలతో ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయుల వచ్చారు. జీవో 317 ద్వారా ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకాలు పోయాయి. ఎన్నో ఏండ్లుగా ఉపాధ్యాయులు లేక విద్యా వలంటీర్లతో నెట్టుకొచ్చిన పాఠశాలలకు ప్రస్తుతం మహర్దశ వచ్చింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు వచ్చారు. ఇంకరూ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏ మేరకు పోస్టులను భర్తీ చేయాలి అనే అంశలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఆ తర్వాత జిల్లాల వారీగా స్థానిక నిరుద్యోగ యువతతో నింపాలని రాష్ట్ర ప్రభుత్వం ధృడసంకల్పంతో ముందుకు వెళ్తున్నది.
ఉమ్మడి జిల్లాలో మూడు దశల్లో..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో తీర్చిదిద్దనున్నారు. సిద్దిపేట జిల్లాలో 972 ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి జిల్లాలో 1239 పాఠశాలలు, మెదక్ జిల్లాలో 924 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చించనున్నది. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులు సంతరించుకోనున్నాయి. తరగతి గదులతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం రానున్నది. ప్రైవేట్ పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్ల మాధ్యమం అనేది సమాజంలో అవసరంగా మారిపోయింది. క్రమంగా ఆంగ్ల మాధ్యమానికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేలా కసరత్తు మొదలు పెట్టింది.
పాఠశాల్లో చేపట్టే పనులు..
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా కూడిన టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల కోసం అవసరమైన మరమ్మతులు లేదా కొత్త లైన్లు వేయడం, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, నల్లా కనెక్షన్లు ఇస్తారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్‌ను సమకూర్చడం, సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రతి పాఠశాలకు రంగులు వేసి దేశ, రాష్ట్ర ప్రముఖుల చిత్రాలతో పాటు విద్యార్థులకు అవసరమైన మ్యాప్‌లు, స్ఫూర్తినిచ్చే కొటేషన్లు రాయించడం చేస్తారు. తరగతి గదులకు అవసరమైన మరమ్మతులు చేస్తారు. డిజిటల్ విద్య అమలు చేయడానికి ఏర్పాట్లు, తదితర పనులు చేపట్టేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు.
ప్రభుత్వ విద్య మరింత బలోపేతం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమవుతాయి. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అంది వారు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడగలిగే స్థాయికి చేరుతారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం హర్షణీయం. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ఆదనపు తరగతి గదులు, ల్యాబ్‌లు, ఫర్నిచర్, ఆహ్లాదకరమైన ఆట స్థలాలు, టాయిలెట్లు మెరుగైన సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు ముస్తాబు కానున్నాయి.
గ్రామీణ విద్యార్థులకు వరం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ఓ అద్భుతం. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవత్మాకమైన మార్పులు తీసుకరావడం చాలా సంతోషం. రూ.7,289 కోట్లతో ప్రభుత్వ విద్యా సంస్థలను మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం గొప్ప విషయం. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల భాషను నేర్పించడంతో విద్యార్థులకు భవిష్యత్‌లో భాషాపరమైన ఇబ్బందులుండవు. పేద విద్యార్థులకు మంచి జరిగే కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.