Anganwadi Cnetres | మద్దూరు (ధూళిమిట్ట), ఏప్రిల్14: పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు అందించడం జరుగుతుంది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, అధికారుల పర్యవేక్షణ లోపమో తెలియదు కానీ గత పదిహేను రోజులుగా పిల్లలు, బాలింతలు, గర్భిణీలు కోడిగుడ్లు అందక పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.
ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు కోడ్డు గుడ్లు అందకపోతుండటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఐసీడీఎస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కోడిగుడ్ల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లకావత్ దేవేందర్నాయక్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుకను వివరణ కోరగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిన మాట వాస్తవమేనని, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.