Dubbak canal | తొగుట, జనవరి 28 : ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసాన్ పల్లి శివారులో దుబ్బాక ప్రధాన కాలువకు పడ్డ గండిని నష్టపోయిన పంట పొలాలను ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. కాలువ మొత్తం తుంగతోపాటు పూడికతో నిండిపోయినప్పటికీ పట్టించుకోకుండా హెచ్చు స్థాయిలో నీటి విడుదల చేయడంతోనే దుబ్బాక ప్రధాన కాలువకు గండి పడిందన్నారు. కాలువలో ప్రవాహం ఎక్కువై కాలువ మీది నుండి పొంగి పొర్లడం జరిగిందని నీళ్లు విడిచిన అధికారులు తర్వాత పట్టించుకోకపోవడంతోనే గండి పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
కేసీఆర్ హయాంలో మూడున్నర ఏళ్లలో ప్రాజెక్టులు నిర్మించుకొని నీటిని కూడా వదులుకోవడం జరిగిందన్నారు. గతంలో కాలువలో పూడికను తొలగించి నీటిని విడుదల చేసే వారని, నేడు కాలువల పూడికను గాలికి వదిలేశారన్నారు. గత రెండేళ్లుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉపకాలువలు లేకపోవడంతో రైతులందరికీ సాగునీరు అందడం లేవని వెంటనే పూర్తి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శాసనసభలో గళమెత్తడం జరిగిందని, నేరుగా మంత్రులతో అధికారులతో మాట్లాడినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
కేసీఆర్ హయాంలో పంట సాగు సమయంలోనే రైతు బంధు
ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేసిన విమర్శలు వారికే వర్తిస్తాయన్నారు. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి దుబ్బాక నియోజకవర్గంలో ఉపకాలువల నిర్మాణం కోసం, ఇర్కోడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు విడుదల జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గతంలో నిర్మించిన కాలువల్లో పూడిక తొలగించి సాగునీరు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ హయాంలో పంట సాగు సమయంలో రైతు బంధు జమ అయ్యేదని.. నేడు సాగు చేసినా ఇంత వరకు రైతుబంధు రావడంలేదని దీనిపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
కాలువకు పడ్డ గండి సమస్యపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించి వెంటనే గండి పూడ్చడంతోపాటు పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పెద్ద మాసాన్ పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వెంటనే సాగునీరు పంపిణీ చేయాలని సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. మా మండలంలో మల్లన్న సాగర్ ఉన్నప్పటికీ మా గ్రామాలకు సాగునీరు అందడం లేవని ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదన్నారు.
రాత్రి సమయంలో నీటి విడుదల సరికాదని, రైతులు సకాలంలో స్పందించి గమనించకపోతే గండిమూలంగా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు. నష్ట పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వేల్పుల స్వామి, నాయకులు నందారం వెంకటేశం గౌడ్ భాస్కర్, మధుసూదన్ రెడ్డి, బోయిని రాములు, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

