Komuravelli | చేర్యాల, మార్చి 9: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలోని కోడెల స్తంభం వద్ద మురుగు నీరు ఏరులైపారుతున్న వాటిని నియంత్రించేందుకు ఆలయ వర్గాలు, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి రెండున్నర నెలలుగా ఇదే తంతు కొనసాగుతున్న సంబంధిత శాఖ అధికారులకు చీమకుట్టినట్టు లేదు. నాలుగు వారాల క్రితం మరమ్మతులు చేసేందుకు జేసీబీతో గుంతలు తీసి పైపులు వేసి పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలిపెట్టారు. ఆలయ అధికారులు చేసుకుంటారు తమకు ఎందుకులే అనుకుంటూ పంచాయతీశాఖ, పంచాయతీశాఖ చేస్తుందని ఆలయవర్గాలు అనుకుంటున్నారో ఏమో కాని భక్తులు బోనాలు తీసుకుపోతూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్వామి వారి దర్శనం కోసం ఎంతో పవిత్రంగా వారి ఇంటి నుంచి బయలుదేరి వచ్చి కోడెల స్తంభం ప్రదేశంలో తమ వాహానాలు పార్క్ చేసుకుని సామాగ్రి కొనుగోలు, షాపింగ్, దర్శనాలు తదితర వాటికి వెళ్లే భక్తులు సదరు నీటిని గమనించకుండా వెళ్లిపోతున్నారు. మురుగు నీరు పారుతున్న దానిని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఏరులై పారుతున్న డ్రైనేజీ సైతం ఎంపీడీవో కార్యాలయం ముందే ఉన్న అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది సైతం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సైతం పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
8వ ఆదివారం సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో స్వామి వారి క్షేత్రంలోని ఆలయ గదులతో పాటు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన గదుల నుంచి భారీగా మురుగు నీరు బయటకు రావడంతో కోడెల స్తంభం వీది మొత్తం మురుగునీరు కమ్ముకుంది. గమనించకుండా వచ్చిన భక్తులు సైతం తమ వాహనాలు అక్కడే పార్క్ చేసుకుని తమ సామాగ్రి తీసుకుని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి మురుగు నీరు పారుతున్న పైపులను మరమ్మత్తులు చేసి నీటిని బయటకు వెళ్లిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయమై ఆలయ ఈవో కే.రామాజంనేయులను ఫోన్లో ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా మురుగు నీరు ప్రవహిస్తున్న విషయాన్ని పంచాయతీశాఖ అధికారులు, స్థానిక పంచాయతీ అధికారులకు తెలియజేశాం.వాటిని మరమ్మత్తు చేసేందుకు పైపులు తదితర సామాగ్రి కావాలంటే ఆలయ నిధుల నుంచి వాటిని కేటాయించామని తెలిపారు. అయిన్నప్పటికీ మరమ్మతులు చేయలేదని దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు.