మద్దూరు(ధూళిమిట్ట), జూలై18: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ధర్మారం గ్రామంలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీరు కోసం గ్రామస్తులు పడుతున్న బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. తాగునీటి సమస్యను తీర్చాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
తాగునీటి కోసం గ్రామస్తులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పలువురు మహిళలు వాపోతున్నారు.
ఇప్పటికైన ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్‌ను వివరణ కోరగా గేట్‌వాల్వ్ ప్రాబ్లమ్‌తో ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడిందని, వెంటనే దానికి మరమ్మతులు చేయించి త్రాగునీటి సమస్యను తీర్చనున్నట్లు తెలిపారు. దీనికితోడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో తాగునీటి కొరత ఏర్పడిందన్నారు.