చేర్యాల, మే 11 : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 15వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
అదే విధంగా కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు అప్పజెప్పడతో పాటు రాతీగీరల వద్ద ప్రదక్షిణలు చేసి కోడెల స్తంభం వద్ద కోడెలను కట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ సురేందర్, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.